తెలంగాణ పదానికి మారుపేరు ‘టీఎన్‌జీఓ’ లు

నిజామాబాద్‌, జనవరి 23

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ పదానికి టీఎన్‌జీఓలు మారుపేరుగా నిలుస్తున్నారని రాష్ట్ర రోడ్లు-భవనాల శాఖా మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి అన్నారు. పోరాడి సాధించుకున్న తెలంగాణలో ఉద్యోగులను తాము ఎన్నడు కూడా వేరు చేసి చూడలేదని, వారితో ప్రభుత్వానికి ఉన్నది పేగు బంధం అని మంత్రి స్పష్టం చేశారు. టీఎన్‌జీఓల సంఘం నిజామాబాద్‌ జిల్లా శాఖ ఆధ్వర్యంలో రూపొందించిన డైరీ, క్యాలెండర్‌ లను మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి సోమవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం సమావేశ మందిరంలో జెడ్పి చైర్మన్‌ దాదన్నగారి విట్ఠల్‌ రావు, అర్బన్‌ ఎమ్మెల్యే బిగాల గణేష్‌ గుప్తా, కలెక్టర్‌ సి.నారాయణ రెడ్డి, పోలీస్‌ కమిషనర్‌ కె.ఆర్‌.నాగరాజు, మేయర్‌ నీతూ కిరణ్‌ తదితరులతో కలిసి ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా టీఎన్‌జీఓ సంఘం జిల్లా అధ్యక్షుడు అలుక కిషన్‌ అధ్యక్షతన ఏర్పాటు చేసిన సభలో ఉద్యోగులను ఉద్దేశించి మంత్రి ప్రసంగించారు. ప్రత్యేక రాష్ట్ర సాధనలో ఉద్యోగుల పాత్ర అమోఘమని, 1967 నాటి ఉద్యమంలోనూ ఆమోస్‌ నేతృత్వంలో ప్రత్యేక తెలంగాణ కోసం పోరాడారని గుర్తు చేశారు. మలి విడత ఉద్యమంలో ఉద్యోగులతో కలిసి పోరాడే అవకాశం లభించడాన్ని అదృష్టంగా భావిస్తున్నామని, తెలంగాణ ఉద్యమానికి ఉద్యోగులు ఉత్ప్రేరకంగా నిలిచారని కొనియాడారు.

అందుకే ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఉద్యోగుల పట్ల ఎల్లవేళలా ఉదార స్వభావంతోనే వ్యవహరిస్తారని పేర్కొన్నారు. అన్ని రంగాల్లో తెలంగాణ యావత్‌ దేశానికి ఆదర్శంగా నిలుస్తోందంటే, అందుకు ఉద్యోగుల కృషి ప్రధాన కారణమని అన్నారు. ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలను, సంక్షేమాభివృద్ధి కార్యక్రమాలను సమర్ధవంతంగా అమలు చేస్తూ అట్టడుగున ఉన్న ప్రజల వరకు తీసుకెళ్తున్నారని, ఫలితంగానే అభివృద్ధి చెందిన గ్రామాల సర్వేలో దేశంలోనే ఇరవైకి గాను 19 గ్రామ పంచాయతీలు తెలంగాణకు చెందినవే ఎంపికయ్యాయని హర్షం వెలిబుచ్చారు. వీటిలో ఒక్క నిజామాబాదు జిల్లాలోనివే ఐదు గ్రామాలు ఉన్నాయని గుర్తు చేశారు.

ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలను ఎంతో అంకితభావంతో, పారదర్శకంగా ఉద్యోగులు అమలు చేయడం వల్లే ఈ ఘనత దక్కిందన్నారు. ఉద్యోగుల తోడ్పాటుతో తెలంగాణ రాష్ట్రం తలసరి ఆదాయంలోనూ నెంబర్‌ వన్‌ గా నిలిచిందన్నారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటయ్యే నాటికి తలసరి ఆదాయం లక్షా 28 వేలు ఉంటే, ప్రస్తుతం అది 2.78 లక్షలకు పెరిగిందన్నారు. ఆదాయ వృద్ధిలోనూ జాతీయ స్థాయిలో వృద్ధిరేటు 9 శాతం ఉండగా, తెలంగాణ రాష్ట్రంలో 16 శాతం ఉందని వివరించారు.

దేశంలోనే ఉద్యోగులకు అత్యధిక జీతాలు అందిస్తున్నది కూడా తెలంగాణ రాష్ట్రమేనని, ఇది తమకు ఎంతో గర్వకారణంగా నిలుస్తుందన్నారు. ఇదే స్పూర్తితో ఉద్యోగులు ముందుకు సాగాలని మంత్రి పిలుపునిచ్చారు. వారి సమస్యల పరిష్కారానికి సత్వర చర్యలు తీసుకుంటామని తెలిపారు.

కలెక్టర్‌ సి.నారాయణరెడ్డి మాట్లాడుతూ, ప్రభుత్వం చేపడుతున్న ప్రతి కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో టీఎన్‌జీఓలు విశేషంగా కృషి చేస్తున్నారని అన్నారు. ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని, అప్పుడే ఉద్యోగులకు కూడా మంచి గుర్తింపు లభిస్తుందని సూచించారు. తమ పనుల కోసం ప్రభుత్వ కార్యాలయాలకు వచ్చే వారి పట్ల ప్రతి ఉద్యోగి అనుకూల ధోరణితో వ్యవహరిస్తూ వారి సమస్యను పరిష్కరించేందుకు చొరవ చూపాలని హితవు పలికారు. దీనివల్ల ఒక కుటుంబమే బాగుపడేందుకు అవకాశం ఉండవచ్చని అన్నారు. తద్వారా అధికార యంత్రాంగం పట్ల ప్రజల్లో మరింత మంచి దృక్పథం ఏర్పడుతుందని, తాము విధులకు న్యాయం చేయగలిగామని ఉద్యోగులకు కూడా సంతృప్తి లభిస్తుందన్నారు.

విధులను అంకితభావంతో నిర్వర్తిస్తూనే, ప్రతి ఒక్కరు తమ ఆరోగ్యాల పట్ల జాగ్రత్తలు పాటించాలని కలెక్టర్‌ సూచించారు. కాగా, జిల్లా కేంద్రంలో ఉద్యోగుల కోసం అన్ని వసతులతో కూడిన కల్యాణ మండపం నిర్మాణానికి రూ. కోటి నిధులు కేటాయిస్తానని అర్బన్‌ శాసన సభ్యులు బిగాల గణేష్‌ గుప్తా ప్రకటించగా, తనవంతు తోడ్పాటును అందిస్తానని మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి భరోసా కల్పించారు.

ఉద్యోగ బాధ్యతల నిర్వహణతో పాటు సామాజిక కార్యక్రమాల్లో సైతం టీఎన్‌జీఓల సంఘం ముందంజలో నిలుస్తోందని జెడ్పి చైర్మన్‌ దాదన్నగారి విట్టల్‌ రావు అభినందించారు. కార్యక్రమంలో నుడా చైర్మన్‌ ప్రభాకర్‌ రెడ్డి, జిల్లా రైతు సమన్వయ సమితి అధ్యక్షురాలు మంజుల, టీఎన్‌జీఓల సంఘం బాధ్యులు, అన్ని శాఖల ఉద్యోగులు పాల్గొన్నారు.

Check Also

రేపు విద్యుత్‌ అంతరాయం

Print 🖨 PDF 📄 eBook 📱 బాన్సువాడ, నవంబర్‌ 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బాన్సువాడ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »