నిజామాబాద్, జనవరి 24
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : జాతీయ బాలికల దినోత్సవ వేడుకల్లో భాగంగా మంగళవారం నిజామాబాద్ నగరంలోని న్యూ అంబేద్కర్ భవన్లో జిల్లా మహిళ, శిశు, సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో (బిబిబిపి పథకంలో భాగంగా) పెద్ద ఎత్తున జాతీయ బాలికల దినోత్సవం నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన జిల్లా పరిషత్ చైర్మన్ దాదన్న గారి విటల్ రావు మాట్లాడుతూ ప్రతి కుటుంబంలో బాలికలను ఉన్నత చదువులు చదివించాలని తల్లిదండ్రులను వారు కోరారు.
సమాజానికి ఆడపిల్లలు మణిహారం లాంటివారని, వారిని చదివించి ఉన్నత స్థాయిలో నిలబెట్టాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉందని గుర్తు చేశారు. బాలికల రక్షణ కోసం అనేక చట్టాలు ప్రభుత్వాలు తీసుకు రావడం మూలంగా బాలికలపై వివక్షత తగ్గిందని పేర్కొన్నారు. బాలికలకు మరింత మెరుగైన సౌకర్యాల కొరకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని అన్నారు. ఆడపిల్లలను మగ పిల్లలతో సమాన దృష్టితో చూడాలని సమానమైన స్వేచ్ఛను వారికి ఇవ్వాలని ప్రజలకు పిలుపునిచ్చారు.
మహిళా కమిషనర్ మెంబర్ సుదం లక్ష్మి మాట్లాడుతూ ఆడపిల్లల రక్షణ కొరకు అనేక చట్టాలు ఉన్నాయని, ఆడపిల్లలు ధైర్యంగా ముందుకు పోవాలని పిలుపునిచ్చారు. అలాగే బాల్య వివాహాలను అరికట్టే విధంగా ప్రతి ఒకరు తోడ్పడాలని, అన్ని రంగాల్లో బాలికలు ముందంజలో రాణించాలని సూచించారు.
జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ప్రతిమ రాజ్ మాట్లాడుతూ ఆరోగ్యం, విద్య అవసరాలను నిర్లక్ష్యం చేయరాదని సూచించారు. బాల్యం నుండే పోషక ఆహారం లోపాలు లేకుండా జాగ్రత్తలు తీసుకుంటే భవిష్యత్తుకు మంచిదన సూచించారు. ఇప్పటికే చాలామంది బాలికలు రక్తహీనతతో బాధపడుతున్నారని వారు గుర్తు చేశారు. బాల్యం నుండి తగు జాగ్రత్తలు తీసుకొని ఆరోగ్యంగా ఉండాలని ఆశాభావం వ్యక్తపరిచారు.
సీనియర్ సివిల్ జడ్జి డిఎల్‌ఎస్‌ఏ సెక్రెటరీ పి.పద్మావతి మాట్లాడుతూ స్త్రీలకు అన్ని రంగాల్లో సమానమైన హక్కులు స్వేచ్ఛ కలిగి ఉన్నారని వారన్నారు. బాలికలకు ప్రత్యేక రక్షణ చట్టాలు ఉన్నాయని గుర్తు చేశారు. డిసిపి అరవింద్ బాబు మాట్లాడుతూ విద్యార్థులు అన్ని రంగాలలో ముందుండాలని అలాగే టీవీలు సెల్‌ఫోన్లకు దూరంగా ఉంటూ ఆరోగ్యాలను కాపాడుకోవాలని సూచించారు. ఈ సందర్బంగా సంతకాల సేకరణ చేశారు.
జిల్లాలోని బాలికా చాంపియన్‌లను సన్మానించారు. కార్యక్రమంలో లేబర్ ఆఫీసర్ యొహన్, జేజేబి మెంబర్ లత, సూపరింటెండెంట్ ఇందిర, బిఆర్‌బి కోఆర్డినేటర్ విజయ లక్ష్మీ, ఐసిడిఎస్ సిడిపివోఎస్ సూపర్ వైజర్లు, డిసిపివో చైతన్య, ఎంఎస్‌కె డబ్ల్యుడబ్ల్యువో స్వప్న, డిసి సౌమ్య, ఐసిపిఎస్ టీం, చైల్డ్ లైన్ టీం విధ్యార్థినీలతో పాటు కార్యక్రమంలో షీ టీం కళ బృందం పాడిన పాటలు, అదే విధంగా చిన్నారుల నృత్య ప్రదర్శనలు అందరిని ఆకట్టుకున్నాయి.