కామారెడ్డి, జనవరి 24
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లాను పొగాకు రహిత జిల్లాగా మార్చాలని జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ వెంకటేష్ దోత్రే అన్నారు. కామారెడ్డి కలెక్టర్ కార్యాలయంలో మంగళవారం పొగాకు నియంత్రణ జిల్లా స్థాయి సమన్వయ కమిటీ సమావేశం, సామర్థ్యం పెంపు పొగాకు రహిత కార్యక్రమం నిర్వహించారు. ఈ సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.
పొగాకు తాగకుండా ప్రతి ఒక్కరు తమ వంతు బాధ్యతగా అవగాహన కల్పించాలని సూచించారు. అడిషనల్ ఎస్పీ అన్యోన్య మాట్లాడారు. పొగాకు సేవించడం వల్ల కలిగే అనర్థాలను తెలిపారు. ప్రభుత్వ కార్యాలయాలు, ప్రజలు గుమ్ముగుడే ప్రాంతాలు బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు, సినిమాలలో పొగ తాగితే వారిపై టోల్ ఫ్రీ నెంబర్ 1800112356 కు ఫోన్ చేయాలని సూచించారు. జాతీయ పొగాకు నియంత్రణ కార్యక్రమం, సామర్థ్యం పెంపు పొగాకు రహిత కార్యక్రమం పై వర్క్ షాప్ ద్వారా డాక్టర్ శ్రవణ్ కుమార్, డాక్టర్ రమిత అవగాహన కల్పించారు.
జిల్లా వైద్యాధికారి లక్ష్మణ్ సింగ్ మాట్లాడారు. ప్రతి మూడు నెలలకు ఒకసారి పొగాకు నియంత్రణపై అవగాహన సమావేశాలు ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. కార్యక్రమంలో ప్రోగ్రాం అధికారి శిరీష, జిల్లా కార్మిక శాఖ అధికారి సురేందర్, జిల్లా నోడల్ అధికారి షేక్ సలాం, ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ కిష్టయ్య, జిల్లా రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ రాజన్న, డెమో వేణుగోపాల్, సుధాకర్, ఎంపీడీవోలు, మున్సిపల్, పోలీస్, వైద్య అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.