కామారెడ్డి, జనవరి 25
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఆధునిక పద్ధతులు అవలంబించి రైతులు అధిక పాలు ఉత్పత్తి చేయాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. కామారెడ్డి మండలం క్యాసంపల్లిలో జిల్లా పశు సంవర్థక శాఖ ఆధ్వర్యంలో ఉచిత పశు వైద్య శిబిరం నిర్వహించారు. శిబిరానికి జిల్లా కలెక్టర్ ముఖ్యఅతిథిగా మాట్లాడారు.
రైతులు పాలు పితికే యంత్రాలు ఉపయోగించాలని తెలిపారు. హైడ్రోఫోనిక్స్ గడ్డి పెంచే విధానం పాటించాలని కోరారు. జిల్లా పశువైద్యాధికారి డాక్టర్ భరత్ మాట్లాడారు. కోరుట్ల వెటర్నరీ కళాశాల నుంచి 64 మంది ఫైనల్ ఇయర్ చదువుతున్న విద్యార్థులు క్షేత్ర పర్యటనలో భాగంగా జాతీయ సేవా పథకం(%చీూూ%) జిల్లాలో ఉచిత పశు వైద్య శిబిరాలు ఏర్పాటు చేశారని తెలిపారు.
ఈనెల 25 నుంచి 31 వరకు పది మండలాల్లో 18 వైద్య శిబిరాలు ఏర్పాటు చేస్తారని చెప్పారు. జంతు సంక్షేమ పక్షోత్సవాలు నిర్వహిస్తున్నామన్నారు. ఈ శిబిరంలో గేదెలకు గర్భకోశ వ్యాధుల నిర్ధారణ, చికిత్సలు చేశారు. దూడలకు నట్టల నివారణ మందులు తాగించారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో స్టాల్ ను ఏర్పాటు చేశారు. ఈ స్టాల్ ను జిల్లా కలెక్టర్ పరిశీలించి సంతృప్తిని వ్యక్తం చేశారు.
కార్యక్రమంలో కోరుట్ల వెటర్నరీ కళాశాల డిన్ మాధవరావు, కామారెడ్డి వెటర్నరీ కళాశాల డీన్ శరత్చంద్ర, హైదరాబాద్ పీవీ నరసింహారావు వెటర్నరీ యూనివర్సిటీ డీన్ చిన్ని ప్రీతం, విజయ డైరీ డిప్యూటీ డైరెక్టర్ ప్రవీణ్ కుమార్, విజయ పాల ఉత్పత్తి దారుల సంఘం అధ్యక్షుడు తిరుపతిరెడ్డి, సర్పంచ్ మంజుల, ఎంపిటిసి సభ్యురాలు భాగ్యలక్ష్మి, ఎన్‌ఎస్‌ఎస్ ప్రోగ్రాం అధికారులు డాక్టర్ కృష్ణ, అరుణ కుమారి, నాగరాజు, పశు వైద్యులు దేవేందర్, రవి కిరణ్, జూనియర్ పశు వైద్యులు పాల్గొన్నారు.