ఎడపల్లి, జనవరి 25
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : గ్రామాల అభివృద్ధి విషయంలో గ్రామస్థాయి అధికారులు, మండల స్థాయి అధికారులు సమన్వయం చేసుకొంటూ పనులు చేయాల్సి ఉండగా ఎడపల్లి మండలంలో అధికారుల మధ్య సమన్వయం లోపించి రోజురోజుకు వివాదాలకు దారితీస్తుంది. దీనికి నిదర్శనం ఎడపల్లి మండలంలోని గ్రామపంచాయతీ సెక్రటరీలు మండల పంచాయతీ అధికారి మధ్యన గత కొంతకాలంగా నడుస్తున్న తెరచాటు యుద్ధం.
పంచాయతీ సెక్రటరీలు గ్రామపంచాయతీలలో సక్రమంగా విధులు నిర్వర్తించకుండా ఇష్టానుసారం పనిచేస్తున్నారని విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని బాధ్యతాయుతంగా పని చేయకుండా గ్రామ సర్పంచులకు అనుకూలంగా పనిచేస్తూ బాధ్యతలను విస్మరిస్తున్నారని ఎడపల్లి ఎంపీఓ ఆరోపిస్తు గ్రామ పంచాయతీ సెక్రెటరీల పట్ల గత కొంతకాలంగా కఠినంగా వ్యవహరిస్తున్నారని సెక్రటరీ లు ఆరోపిస్తున్నారు.
ఎంపీఓ ఆదేశాలు పాటించకుండా ఇష్టానుసారంగా గ్రామపంచాయతీ కార్యాలయాల్లో వ్యవహరిస్తున్నారంటూ ఎంపీఓ పంచాయతీ సెక్రటరీలపై గత కొంతకాలంగా కఠినంగా వ్యవహరించడం మొదలుపెట్టారని పంచాయతీ సెక్రెటరీలు వాపోతున్నారు. పంచాయతీ కార్యదర్శులు ఎంపీఓపై ఎంపీడీవో గోపాలకృష్ణ సమక్షంలో పంచాయతీ ఏర్పాటు చేశారు.
ఎంపీఓపై పంచాయతీ సెక్రటరీలు పలు ఆరోపణలు చేయడంతో ఎంపీడీవో గోపాలకృష్ణ ఎంపీపీ శ్రీనివాస్‌లు బుధవారం సెక్రటరీలతో ఎంపీఓ కలిసి మండల పరిషత్ కార్యాలయంలో సమావేశం ఏర్పాటు చేశారు. సమావేశంలో పలువురు సెక్రటరీలు వైఖరిపై ఎంపీడీవోకు ఫిర్యాదులు చేశారు. సెక్రటరీల వైఖరిపై ఎంపీఓ సుభాష్ చంద్రబోస్ ఎంపీడీవోకు వివరించారు. ఎంపీడీఓ ముందే పంచాయతీ సెక్రెటరీలు, ఎంపీఓ పరస్పర ఆరోపణలు ప్రత్యారోపణలకు దిగారు.
ఎంపీఓ ఆదేశాలను పాటించలేదని ఆరోపిస్తూ కొంతమంది సెక్రటరీలకు ఇటీవల ఎంపీఓ సుభాష్ చంద్రబోస్ నోటీసులు జారీ చేశారని పలువురు సెక్రటరీ లు ఆవేదన వ్యక్తం చేసారు. నోటీసుల జారీ విషయం ఎంపీడీవో దృష్టిలో లేనందున తనకు తెలియకుండా ఇకపై ఏ కార్యదర్శికి కూడా నోటీసులు జారీ చేయవద్దని ఎంపీడీవో గోపాలకృష్ణ ఎంపీఓను ఆదేశించారు. ఎంపీఓ, పలువురు సెక్రటరీల వాదనలు విన్న ఎంపీడీవో గోపాలకృష్ణ, ఎంపీపీ శ్రీనివాస్ ఇరువురి మధ్య సయోధ్య కుదిర్చారు. ఇకనుండి పంచాయతీ సెక్రటరీలు, ఎంపీఓతో ఒకరికొకరు సమన్వయంతో పని చేసుకొంటూ గ్రామాల అభివృద్ధికి పాటు పడాలని వారు సూచించారు.