ఓటింగ్‌లో పాల్గొని భవితను నిర్దేశించుకోవాలి

నిజామాబాద్‌, జనవరి 25

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రజాస్వామ్యంలో ఎంతో కీలకమైన ఓటు హక్కు విలువను ప్రతి ఒక్కరు గుర్తెరగాలని కలెక్టర్‌ సి.నారాయణరెడ్డి సూచించారు. పద్దెనిమిది సంవత్సరాలు నిండిన వారందరూ ఓటరుగా నమోదు కావడంతో పాటు, ఎన్నికల్లో తప్పనిసరిగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. 13 వ జాతీయ ఓటరు దినోత్సవాన్ని పురస్కరించుకుని బుధవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం సమావేశ మందిరంలో నిర్వహించిన కార్యక్రమానికి కలెక్టర్‌ అధ్యక్షత వహించగా, పోలీస్‌ కమిషనర్‌ కే.ఆర్‌.నాగరాజు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

భారత ప్రధాన ఎన్నికల కమిషనర్‌ సందేశం అనంతరం, జిల్లా పాలనాధికారి ఓటర్లచే ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ, రాజ్యాంగం ద్వారా ప్రసాదించబడిన ఓటు హక్కు ప్రజాస్వామ్య పరిరక్షణకు పునాదిగా నిలుస్తోందని గుర్తు చేశారు. సుమారు 94 కోట్ల 50 లక్షల పైచిలుకు ఓటర్లు కలిగిన భారతదేశ ఎన్నికల వ్యవస్థ ప్రపంచంలోనే అతి పెద్దదని తెలిపారు. అయినప్పటికీ ఓటు హక్కు ద్వారా ఎంతో పారదర్శకంగా, సాఫీగా మనల్ని పరిపాలించే నాయకులను మనం ఎన్నుకోగల్గుతున్నామని, ఈ దిశగా ఎన్నికల సంఘం ఎలాంటి అనుమానాలకు తావు లేకుండా పకడ్బందీగా ఎన్నికలు జరిపిస్తుండడం ఎంతో గర్వకారణమని కలెక్టర్‌ పేర్కొన్నారు.

స్వేచ్చాయుత వాతావరణంలో, ప్రజాసేవకు పాటు పడే మంచి నాయకులను ఓటు ద్వారా ఎన్నుకోవాలని హితవు పలికారు. ప్రలోభాలకు లోనై ఓటును దుర్వినియోగం చేస్తే, అనేక దుష్ప్రభావాలు ఎదుర్కోవాల్సిన పరిస్థితి నెలకొంటుందని అన్నారు. నా ఒక్క ఓటుతో ఏమవుతుందిలే అనే భావన ఎంతమాత్రం సరికాదని, ప్రజాస్వామ్య పరిరక్షణలో, మంచి పాలకులను ఎన్నుకోవడంలో ప్రతి ఓటూ ఎంతో కీలకమైనదని కలెక్టర్‌ సూచించారు. అప్పుడే ప్రజాస్వామ్యం మరింత గొప్పగా పరిఢవిల్లుతుందని, అద్భుత ఫలితాలు వస్తాయని ఆకాంక్షించారు. ఎలక్షన్‌ డే అంటే హాలిడే కాదని, మన భవితను నిర్దేశించుకునే అతి కీలకమైన రోజుగా గుర్తించాలని ఓటర్లకు పిలుపునిచ్చారు.

ఎన్నికల్లో సగటున 67 % మంది మాత్రమే ఓటు హక్కు వినియోగించుకుంటున్నారని, విద్యావంతులు ఎక్కువగా ఉండే పట్టణాలు, నగరాల్లో ఓటింగ్‌ శాతం మరింత తక్కువగా నమోదవుతుండటం దురదృష్టకరమని అన్నారు. మనల్ని పాలించే వారిని మనం ఎన్నుకునే బాధ్యతను విస్మరించడం ఎంతవరకు సమంజసమో ప్రతి ఒక్కరు ఆలోచన చేయాలన్నారు. 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికి ఓటు హక్కు కల్పించాలనే సదుద్దేశ్యంతో ఎన్నికల సంఘం కీలకమైన మార్పులు చేసిందని అన్నారు.

ఇదివరకు ప్రతి ఏడాది జనవరి 01 న కొత్త ఓటర్ల పేర్లను జాబితాలో నమోదు చేసేవారని, ప్రస్తుతం ఏడాదిలో నాలుగు పర్యాయాలు నమోదు చేసుకునే వెసులుబాటును కల్పించిందని తెలిపారు. ఈ అవకాశాన్ని అర్హులైన వారందరు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. పోలీస్‌ కమిషనర్‌ కే.ఆర్‌.నాగరాజు మాట్లాడుతూ, జాతి, కుల, మత, లింగ, వర్ణ భేదాలు, బడుగు, బలహీన వర్గాలు అనే తేడా లేకుండా పద్దెనిమిదేళ్లు దాటిన పౌరులందరికీ రాజ్యాంగం ఓటు హక్కును ప్రసాదించిందని అన్నారు. ప్రజాస్వామ్యంలో ఓటు అనే ఆయుధంతో ఓటర్లు తమకు నచ్చిన వారిని పాలకులుగా ఎన్నుకునే అవకాశం రాజ్యాంగం కల్పించినందున, ఈ హక్కును ఓటర్లందరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

ఓటు హక్కు ప్రాముఖ్యత, ఔన్నత్యం గురించి యువత ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఎన్నికల్లో క్రమం తప్పకుండా ఓటు హక్కును వినియోగించుకుంటున్న సీనియర్‌ సిటిజన్లను, ఓటరు నమోదు ప్రక్రియ విధులను సమర్ధవంతంగా నిర్వహించిన బీ.ఎల్‌.ఓలు, ఎన్నికల అధికారులను, కొత్తగా నమోదైన యువ ఓటర్లను జిల్లా యంత్రాంగం తరపున సత్కరించారు.

జాతీయ ఓటరు దినోత్సవాన్ని పురస్కరించుకుని ఏర్పాటు చేసిన పోటీలలో గెలుపొందిన విద్యార్థిని, విద్యార్థులకు బహుమతులు ప్రదానం చేశారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు చిత్రామిశ్రా, బి.చంద్రశేఖర్‌, నిజామాబాద్‌ ఆర్డీఓ రవి, వివిధ శాఖల అధికారులు, విద్యార్థులు, పెద్ద సంఖ్యలో ఓటర్లు పాల్గొన్నారు.

Check Also

దివ్యాంగులకు క్రీడా పోటీలు

Print 🖨 PDF 📄 eBook 📱 నిజామాబాద్‌, నవంబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »