నిజామాబాద్, జనవరి 26
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : భారత గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని నిజామాబాద్ సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో రిపబ్లిక్ డే వేడుకలను ఘనంగా నిర్వహించారు. జిల్లా పాలనాధికారి సి.నారాయణరెడ్డి త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించి, పోలీసుల నుండి గౌరవ వందనం స్వీకరించారు. వివిధ శాఖల ద్వారా జిల్లాలో అమలవుతున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు, సాధించిన ప్రగతి గురించి కీలకోపన్యాసం చేశారు.
జెడ్పి చైర్మన్ దాదన్నగారి విట్ఠల్ రావు, ఎమ్మెల్సీ డి.రాజేశ్వర్, నగర మేయర్ నీతూకిరణ్, జిల్లా జడ్జి కె.సునీత, పోలీస్ కమిషనర్ కేఆర్.నాగరాజు, నుడా చైర్మన్ ప్రభాకర్ రెడ్డి, అదనపు కలెక్టర్‌లు చంద్రశేఖర్, చిత్రామిశ్రా, ఆయా శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా అధికారులు, పుర ప్రముఖులు కలెక్టర్‌ను కలిసి పరస్పరం గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఉత్తమ సేవలు అందించిన ఉద్యోగులకు కలెక్టర్ ప్రశంసాపత్రాలు బహూకరించారు. వివిధ శాఖల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్టాల్స్‌ను తిలకించారు.
ఉత్సాహభరితంగా చిన్నారుల సాంస్కృతిక ప్రదర్శనలు
రిపబ్లిక్ డే వేడుక సందర్భంగా చిన్నారుల సాంస్కృతిక ప్రదర్శనలు ఆహుతులను అలరింపజేశాయి. ఎదనిండా దేశభక్తి భావాన్ని నింపుకుని తమ ప్రదర్శనలతో గణతంత్ర దినోత్సవ వేడుకలకు వన్నెలద్దారు. ప్రభుత్వ రెసిడెన్షియల్ పాఠశాలలకు చెందిన బాలబాలికలు మేరా భారత్ మహాన్ గేయంపై చూడచక్కని నృత్య రీతులను అలవోకగా ప్రదర్శిస్తూ ఔరా అనిపించారు.
వందేమాతరం గేయంపై వసుధ ఇంపీరియల్ పీపుల్ స్కూల్ విద్యార్థులు, ధరణీ దండాలమ్మ గీతం పై అభ్యాస హైస్కూల్ చిన్నారులు, ‘శాంతినికేతన గీతం…ఇది సబర్మతీ సంకేతం’ గేయం పై విజయ్ హైస్కూల్ బాలబాలికలు ఏకరూప దుస్తులు ధరించి తమ అభినయంతో అలరింపజేశారు.
ఇందల్వాయి కేజీబీవీ విద్యార్థినులు ‘చూడాచక్కాని తల్లి… చుక్కల్లో జాబిల్లి’ జానపద గేయం పై చేసిన నృత్య ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ సందర్భంగా చిన్నారులను కలెక్టర్ తో పాటు ఇతర అతిథులు, జిల్లా ఉన్నతాధికారులు వారి వద్దకు వెళ్లి ప్రత్యేకంగా అభినందించారు. ఈ వేడుకల్లో అన్ని శాఖలకు చెందిన అధికారులు, సిబ్బంది, స్వాతంత్య్ర సమరయోధులు, ప్రజలు, విద్యార్థిని, విద్యార్థులు పాల్గొన్నారు.