బాన్సువాడ, జనవరి 27
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రాష్ట్రంలో పనిచేస్తున్న అంగన్వాడి ఉద్యోగుల సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని కోరుతూ శుక్రవారం బాన్సువాడ పట్టణంలోని ఐసిడిఎస్ సిడిపిఓ కార్యాలయం ముందు అంగన్వాడీ టీచర్లతో కలిసి సిఐటియు నాయకులు రవీందర్ ఖలీల్ ధర్నా నిర్వహించి అనంతరం వినతి పత్రం అందజేశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలో సుమారు 70 వేల మంది అంగన్వాడి ఉద్యోగులు పనిచేస్తారని వీరంతా బడుగు బలహీన వర్గాలకు చెందిన వారే ఎక్కువగా ఉన్నారని గత 40 సంవత్సరాలుగా ఐసిడిఎస్ లో పేద ప్రజలకు సేవలందిస్తున్న ప్రభుత్వం వీరికి కనీస వేతనం పెన్షన్ ఈఎస్‌ఐ ఉద్యోగ భద్రత నేటికీ కల్పించలేదని దీనివల్ల అంగన్వాడి ఉద్యోగులు చాలా నష్టపోతున్నారు అన్నారు.
ఇకనైనా ప్రభుత్వం అంగన్వాడి ఉద్యోగుల సమస్యలను సత్వరమే పరిష్కరించాలని లేనిచో మార్చ్ ఒకటి రెండు మూడు తేదీల్లో మూడు రోజులు రాష్ట్రవ్యాప్తంగా సమ్మె చేయనున్నట్లు వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా నాయకులు రవీందర్, ఖలీల్, అంగన్వాడి ప్రాజెక్టు కార్యదర్శి రాధా, సెక్టర్ లీడర్ వజ్ర, రోజా, శివగంగ, చుక్కమ్మ, అంగన్వాడి టీచర్లు తదితరులు పాల్గొన్నారు.