నిజామాబాద్, జనవరి 27
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మన ఊరు – మన బడి కార్యక్రమం కింద తొలి విడతగా ఎంపిక చేసిన పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పన పనులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయించాలని రాష్ట్ర విద్యా శాఖా మంత్రి సబితా ఇంద్రారెడ్డి సూచించారు. ఈ.డబ్ల్యు.ఐ.డీ.సి. చైర్మన్ రావుల శ్రీధర్ రెడ్డి, రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ, కమిషనర్ దేవసేన తదితరులతో కలిసి మంత్రి సబితా ఇంద్రారెడ్డి శుక్రవారం సాయంత్రం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా కలెక్టర్లతో మన ఊరు – మన బడి పనుల ప్రగతిపై సమీక్ష జరిపారు.
ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతుల జాబితా రూపకల్పన గురించి ఆరా తీశారు. ప్రతి మండలంలో కనీసం రెండు పాఠశాలల్లో ఈ నెల 30 వ తేదీ నాటికి మన ఊరు – మన బడి పనులన్నీ పూర్తి చేసి, సంబంధిత జిల్లాల మంత్రులు, శాసన సభ్యులతో ప్రారంభోత్సవాలు చేయించేందుకు బడులను సిద్ధం చేయాలన్నారు. పెద్ద ఎత్తున నిధులను వెచ్చిస్తూ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నందున, ఏ చిన్న పని కూడా పెండిరగ్లో లేకుండా నిర్దేశిత నాణ్యతా ప్రమాణాలతో పూర్తి చేయించాలన్నారు. ప్రారంభోత్సవానికి సమయం సమీపించినందున తుదిదశలో మిగిలి ఉన్న పనులను వేగవంతం చేయిస్తూ, కట్టుదిట్టమైన పర్యవేక్షణ చేయాలన్నారు.
డ్యూయల్ డెస్క్ లు, ఇతర ఫర్నిచర్ ఇప్పటికే ఆయా జిల్లాలకు చేరడం ప్రారంభం అయ్యిందని, మరో రెండు రోజుల్లో అన్ని జిల్లాలకు పూర్తి స్థాయిలో చేరుకునేలా చర్యలు తీసుకున్నామని తెలిపారు. కాగా, ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతుల ప్రక్రియ ఎలాంటి అపోహలకు తావులేకుండా పూర్తి పారదర్శంగా ఆన్ లైన్ విధానంలో జరిగేలా కలెక్టర్లు చొరవ చూపాలని మంత్రి సూచించారు.
వీడియో కాన్ఫరెన్సులో పాల్గొన్న అదనపు కలెక్టర్ చిత్రామిశ్రా మాట్లాడుతూ, జిల్లాలో ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతులకు సంబంధించి ఇప్పటికే రూపొందించిన ఖాళీలు, సీనియారిటీ జాబితాలను ప్రదర్శించేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకున్నామని మంత్రి దృష్టికి తెచ్చారు. మెడికల్ బోర్డును సైతం ఏర్పాటు చేశామని అన్నారు.
మన ఊరు – మన బడికి సంబంధించి ఇప్పటికే నిర్దేశిత బడులలో పనులు పూర్తయ్యాయని, ఉపాధి హామీ కింద మంజూరు చేసిన పనుల కారణంగా పలు పాఠశాలల్లో ఇంకనూ కొన్ని పనులు పెండిరగ్లో ఉన్నాయని, త్వరలోనే అవి కూడా పూర్తవుతాయని తెలిపారు. వీడియో కాన్ఫరెన్సులో జిల్లా విద్యాశాఖ అధికారి ఎన్.వి.దుర్గాప్రసాద్, ప్రణాళిక విభాగం సమన్వయకర్త హన్మంత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.