ఆర్మూర్, జనవరి 30
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : అనారోగ్యంతో బాధపడుతూ ఆర్థిక ఇబ్బందుల వల్ల మెరుగైన చికిత్స పొందలేని ఒక వ్యక్తికి పీయూసీ చైర్మన్, ఆర్మూర్ ఎమ్మెల్యే, టీఆర్ ఎస్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు ఆశన్నగారి జీవన్ రెడ్డి ఆపన్నహస్తం అందించారు.
నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మండలం మిర్దాపల్లి గ్రామానికి చెందిన మహమ్మద్ షఫీ గతకొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతూ నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. కాగా వైద్య చికిత్స కోసం ఆర్థిక సాయం అందించాలని ఆయన కుటుంబ సభ్యులు ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్ రెడ్డిని ఆశ్రయించారు. వెంటనే ఆయన సీఎంఆర్ఎఫ్ అధికారుల దృష్టికి ఈ విషయాన్ని తీసుకువచ్చి రెండు లక్షల 50 వేల రూపాయల ఎల్వోసీని మంజూరు చేయించారు.
జీవన్‌రెడ్డి సోమవారం ఎల్వోసీ చెక్కును షఫీ కుటుంబ సభ్యులకు అందజేశారు. తమకు అండగా నిలిచిన ఎమ్మెల్యే జీవన్ రెడ్డికి వారు కృతజ్ఞతలు తెలిపారు. కాగా ఎల్ వో సీ మంజూరు చేసిన సీఎం కేసీఆర్‌కు, వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావుకు జీవన్ రెడ్డి ధన్యవాదాలు తెలిపారు.