నిజామాబాద్, జనవరి 30
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రజావాణి కార్యక్రమానికి ప్రాధాన్యతనిస్తూ పెండిరగ్ ఉన్న అర్జీలను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ సి.నారాయణరెడ్డి అధికారులకు సూచించారు. ప్రజా సమస్యల సత్వర పరిష్కారం కోసం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 90 ఫిర్యాదులు అందాయి.
జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ఫిర్యాదుదారులు తమ సమస్యలను కలెక్టర్ తో పాటు అదనపు కలెక్టర్ చంద్రశేఖర్, జెడ్పి సీఈఓ గోవింద్, డీపీఓ జయసుధలకు విన్నవిస్తూ అర్జీలు సమర్పించారు. కాగా, అర్జీలను పెండిరగ్ లో పెట్టకుండా ఎప్పటికప్పుడు పరిశీలన జరుపుతూ, సమస్యలను పరిష్కరించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. పరిష్కరించిన అర్జీల వివరాలను ఆన్‌లైన్‌లో అప్లోడ్ చేయడంతో పాటు అర్జీదారులకు సమాచారం అందించాలని సూచించారు. కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
పదవ తరగతి, ఇంటర్మీడియేట్ వార్షిక పరీక్షలు సమీపించినందున విద్యార్థులను అన్ని విధాలుగా సన్నద్ధం చేయాలని కలెక్టర్ సి.నారాయణరెడ్డి సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. ప్రజావాణి కార్యక్రమం అనంతరం కలెక్టర్ అధికారులతో వివిధ అంశాలపై సమీక్ష జరిపారు. అన్ని ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలతో పాటు, ఎస్సీ, ఎస్టీ, బీ.సీ, మైనారిటీ సంక్షేమ వసతి గృహాలకు చెందిన విద్యార్థులకు ప్రత్యేక తరగతులు, స్టడీ అవర్స్ నిర్వహించాలని సూచించారు.
ఏమాత్రం సమయం వృధా చేయకుండా విద్యార్థులు వార్షిక పరీక్షలకు అన్ని విధాలుగా సమాయత్తం అయ్యేలా, తద్వారా మెరుగైన ఫలితాలు సాధించేలా ప్రణాళికాబద్ధంగా కృషి చేయాలని, జిల్లా అధికారులు నిరంతరం పర్యవేక్షణ జరపాలని కలెక్టర్ ఆదేశించారు. ఈసారి వార్షిక పరీక్షల్లో పూర్తి స్థాయిలో సిలబస్ ఉన్నందున పునఃశ్చరణ తరగతులను పక్కాగా నిర్వహించేలా చర్యలు తీసుకోవాలన్నారు. కాగా, ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న మన ఊరు – మన బడి కార్యక్రమం కింద ఇప్పటికే పనులు పూర్తయిన పాఠశాలల్లో ఫిబ్రవరి 1 వ తేదీన ప్రారంభోత్సవాలు నిర్వహించనున్న నేపథ్యంలో అన్ని ఏర్పాట్లను పూర్తి చేయాలని మండల ప్రత్యేక అధికారులను ఆదేశించారు.
దృష్టి లోపాలను దూరం చేయాలనే సంకల్పంతో చేపట్టిన కంటి వెలుగు శిబిరాలు ఎలా కొనసాగుతున్నాయన్నది క్షేత్ర స్థాయిలో పర్యవేక్షణ జరపాలని, మండల స్థాయి అధికారులకు, వైద్య బృందాలకు మధ్య సమన్వయము పెంపొందేలా చూడాలన్నారు. ప్రతి రోజు ఒక్కో శిబిరంలో తప్పనిసరిగా సగటున 120 నుండి 130 మందికి కంటి పరీక్షలు నిర్వహించాలన్నారు. హరితహారం నిర్వహణను మెరుగుపర్చాలని, అన్ని రహదారులకు ఇరువైపులా, ఆయా కార్యాలయాలు, వివిధ ప్రదేశాల్లో నాటిన మొక్కలు ఏపుగా పెరగాలని అన్నారు. పల్లె ప్రకృతి, బృహత్ పల్లె ప్రకృతి వనాలు పచ్చదనంతో ఆహ్లాదంగా కనిపించాలన్నారు.
మొక్కల నిర్వహణలో నిర్లక్ష్యానికి తావిస్తే, కఠిన చర్యలు తప్పవని కలెక్టర్ ఈ సందర్భంగా హెచ్చరించారు. కాగా, అన్ని ప్రభుత్వ శాఖల కార్యాలయాలను సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోకి మార్చుకోవాలని సూచించారు. ఇంకనూ ఏవైనా శాఖల కార్యాలయాలు ప్రైవేట్, అద్దె భవనాల్లో కొనసాగుతున్నట్లైతే అదనపు కలెక్టర్‌ను సంప్రదించాలని, వారికి సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో చోటు కల్పిస్తామని అన్నారు.
సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో విధులు నిర్వర్తిస్తున్న ప్రతి ఉద్యోగికి సంబంధించి బయో-మెట్రిక్ హాజరు ప్రక్రియను నిశితంగా పర్యవేక్షించాలని, విధుల పట్ల నిర్లక్ష్య ధోరణిని ప్రదర్శించే వారిపై చర్యలు తీసుకోవాలని అదనపు కలెక్టర్ బి.చంద్రశేఖర్ కు సూచించారు.
జిల్లాలో ఆయిల్ పాం పంట విస్తీర్ణం పెరిగేలా చిత్తశుద్ధితో కృషి చేయాలని కలెక్టర్ సూచించారు. ఉద్యానవన, వ్యవసాయ శాఖల అధికారులు పరస్పర సమన్వయంతో పనిచేస్తూ మార్చ్ నెలాఖరు నాటికి జిల్లాకు కేటాయించిన లక్ష్యం మేరకు పూర్తి స్థాయి విస్తీర్ణంలో ఆయిల్ పాం పంట సాగు జరిగేలా చొరవ చూపాలన్నారు.