నిజామాబాద్, జనవరి 31
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఏసీడి పేరుతో ప్రజలపై వేస్తున్న అదనపు చార్జీలను ప్రభుత్వం తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ సీపీఐ (ఎం.ఎల్) ప్రజాపంథా పార్టీ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా నిజామాబాద్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ప్రభుత్వ ఐటిఐ నుండి వర్ని చౌరస్తాలో గల విద్యుత్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించి ధర్నా నిర్వహించారు. ఎస్.ఈ స్పందించకపోవడంతో ప్రజాపంథా నాయకులు కార్యాలయంలోకి చొచ్చుకెళ్లే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో ఎస్.ఈ బయటకు రావడంతో వినతి పత్రం అందజేశారు.
ఈ సందర్భంగా సీపీఐ (ఎం.ఎల్) ప్రజాపంథా జిల్లా కార్యదర్శి (ఇన్చార్జి) వనమాల కృష్ణ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో ప్రజలపై ఏసీడీ (అడ్వాన్స్ కంజప్షన్ డిపాజిట్) పేరుతో వేస్తున్న అదనపు భారాన్ని సిపిఐ (ఎం.ఎల్) ప్రజాపంథా పార్టీ తీవ్రంగా ఖండిస్తుందన్నారు. ప్రజలపై వేసే ఈ అదనపు భారాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తున్నామన్నారు.
సంక్షేమం పేరుతో గొప్పలు చెప్పుకునే కెసిఆర్ ప్రభుత్వం ఏసిడి పేరుతో భారాలు మోపి, అక్రమ వసూళ్లకు పూనుకోవడం దుర్మార్గమైన చర్యన్నారు. గత సంవత్సరం 500 యూనిట్లపైన ఏసీడీ చార్జీలను మోపిందని, ఈ సంవత్సరం 3 యూనిట్ల కంటే తక్కువ వినియోగించే వినియోగదారులపై ఏసీడీ చార్జీలను మోపుతున్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యుత్ చార్జీపై రెండు రెట్లు అదనంగా వసూలు చేయడం వెంటనే ఆపాలని, చెల్లించిన వారికి చార్జీలను వెనక్కి ఇవ్వాలని డిమాండ్ చేశారు.
సిపిఐ (ఎం.ఎల్) ప్రజాపంథా రాష్ట్ర నాయకులు వి.ప్రభాకర్ మాట్లాడుతూ రాష్ట్రంలో 27 లక్షల వ్యవసాయ కనెక్షన్లకు 24 గంటల కరెంటు ఇస్తున్నామని ప్రభుత్వం చెప్తుందన్నారు. కానీ వాస్తవానికి వ్యవసాయ మోటార్లకు విద్యుత్ కోతలు కొనసాగుతున్నాయని ఆరోపించారు. డెవలప్మెంట్ చార్జీల పేరుతో అదనపు భారాలను మోపిందన్నారు. అయినప్పటికీ విద్యుత్ సంస్థ అప్పుల్లో కూరుకుపోయిందని ఆరోపించారు. ప్రజలపై భారాలు మోపడం సిగ్గుచేటన్నారు. వెంటనే ఏసీడీ చార్జీలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు.
కార్యక్రమంలో సీపీఐ (ఎం.ఎల్) ప్రజాపంథా జిల్లా నాయకులు ఎం. వెంకన్న, బి.దేవారం, ఎం.నరేందర్, ఎం.ముత్తెన్న, డి.రాజేశ్వర్, బి.మల్లేశ్, పి.రామకృష్ణ, సాయగౌడ్, ఎం.సుధాకర్, పీఓడబ్ల్యు జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు వి.గోదావరి కే సంధ్యారాణి, ఏఐపీకీఎంఎస్ జిల్లా కార్యదర్శి కిషన్, ఏఐపీకేఎస్ జిల్లా కార్యదర్శి గుమ్మల గంగాధర్ మరియు వివిధ ప్రజాసంఘాల బాధ్యులు, నాయకులు పాల్గొన్నారు.