హైదరాబాద్, జనవరి 31
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిబంధనల ప్రకారమే పీహెచ్డీ కోర్సుల్లో ప్రవేశానికి అర్హత పరీక్షలు నిర్వహించామని… పరీక్షల్లో ఉత్తీర్ణులైన వారు ఇంటర్వ్యూ కోసం దరఖాస్తు చేసుకోవాలని ఉస్మానియా విశ్వవిద్యాలయం ఓ ప్రకటనలో కోరింది. అర్హత పరీక్షల్లో ఉత్తీర్ణులు కాని కొద్ది మంది అనవసర రాద్దాంతం చేస్తున్నారని స్పష్టం చేసింది. యూజీసీ నిబంధనల ప్రకారమే నడుచుకుంటున్నామని…. ఇకపై ఏటా పి.హెచ్.డి ప్రవేశ పరీక్షలు నిర్వహించనున్నట్లు అధికారులు వెల్లడిరచారు.
నిబంధనలకు విరుద్ధంగా ఇష్టానుసారం అర్హత సాధించని విద్యార్థులకు ప్రవేశాలు కల్పించలేమని స్పష్టం చేశారు. అలా చేస్తే… ఇప్పటికే ఎంతో మంది విద్యార్థులు పూర్తి చేసిన పి.హెచ్.డి డిగ్రీలకు విలువ తగ్గుతుందని వివరించారు. యూజీసీ నిబంధనల ప్రకారం నోటిఫికేషన్ ప్రకారమే ప్రవేశాలు కల్పించాల్సి ఉంటుందని.. సీట్ల పెంపు సాధ్యం కాదని చెప్పారు. నిబంధనల ప్రకారం ఆయా విభాగల వారీగా రిజర్వేషన్లను పాటిస్తున్నామని…. కొద్ది మందికి రిజర్వేషన్లలో నష్టం జరుగతుందని కొద్ది మంది చేస్తున్న ప్రచారంలో వాస్తవం లేదని అన్నారు.
కేటగిరి 1లో యూజీసీ నెట్ / జేఆర్‌ఎఫ్ ఉన్న వారికి ప్రవేశాలు కల్పిస్తున్నామని… కేటగిరి 2 కింద నిబంధనల ప్రకారం అర్హత పరీక్ష నిర్వహించామని చెప్పారు. యూజీసీ నిబంధనల ప్రకారం అర్హత పరీక్షలో 50 శాతం మార్కులు సాధించిన వారు మాత్రమే ఉత్తీర్ణులైనట్లని… అంతకన్నా తగ్గించటం కుదరదని వివరించారు. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ కేటగిరీల వారికి 5శాతం అర్హత మార్కుల్లో మినహాయింపు ఇచ్చామని అన్నారు.
నాక్ ఏ GG హోదా కలిగిన ఉస్మానియా విశ్వవిద్యాలయానికి త్వరలోనే మరోసారి రేటింగ్ ప్రక్రియ ప్రారంభం కానుందని… ఈ దశలో ఎలాంటి మినహాయింపులకు తావు లేదని చెప్పారు. ప్రస్తుతం అర్హత సాధించని విద్యార్థులు వచ్చే విద్యాసంవత్సరానికి విడుదలయ్యే ప్రవేశపరీక్షకు సిద్ధం కావాలని సూచించారు.