కామారెడ్డి, జనవరి 31
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రభుత్వం బకాయి పడిన వడ్డీ లేని రుణాల బకాయిలు, స్రీ నిధి వడ్డీ, అభయ హస్తం డబ్బులు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ బీజేపీ కామారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గ ఇంఛార్జి కాటిపల్లి వెంకట రమణ రెడ్డి ఆధ్వర్యంలో దోమకొండ మండలంలోని అన్ని గ్రామాల మహిళలు మండల కేంద్రంలో నిరసన ర్యాలీ చేపట్టారు, అనంతరం ఎంపిడివో కార్యాలయానికి చేరుకుని వినతి పత్రం అందజేశారు.
ఈ సందర్భంగా వెంకట రమణారెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విఆర్‌వో వ్యవస్థని ఎత్తి వేసినట్టుగా మహిళా సంఘాలను కూడా ఎత్తి వేసే ప్రయత్నం చేస్తోందని అన్నారు. మహిళలను కేవలం ఓటు బ్యాంకుగా మాత్రమే పరిగణిస్తున్నారు అని, వారికి న్యాయంగా అందాల్సిన అనేక రాయితీలను ప్రభుత్వం రద్దు చేసిందని, గత 5 సంవత్సరాలుగా మహిళకు అందాల్సిన వడ్డీ లేని రుణాల విడుదల కోసం మహిళలు ఎదురు చూస్తున్నా ప్రభుత్వం బకాయిలు జమ చేయటం లేదనీ అన్నారు.
ఇకనైనా ఆలస్యం చేయకుండా మహిళలకు రావలసిన వడ్డీ సొమ్ము మహిళల ఖాతాల్లో జమ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఎట్టి పరిస్థితుల్లో మహిళల ఖాతాల్లో డబ్బులు వచ్చే వరకు బీజేపీ అండగా ఉంటుందని అన్నారు.