నిజామాబాద్, జనవరి 31
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : దృష్టి లోపాలను దూరం చేసేందుకు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కంటి వెలుగు కార్యక్రమాన్ని జిల్లాలో సమర్ధవంతంగా నిర్వహిస్తున్నారని కలెక్టర్ సి.నారాయణరెడ్డి సంబంధిత అధికారులు, సిబ్బందిని అభినందించారు. ఇప్పటివరకు ఎలాంటి ఫిర్యాదులకు ఆస్కారం లేకుండా చక్కటి సమన్వయంతో బాధ్యతాయుతంగా విధులు నిర్వర్తిస్తున్నారని, కంటి వెలుగు శిబిరాలు ముగిసేంత వరకు కూడా ఇదే స్పూర్తితో ముందుకు సాగాలని సూచించారు.
మంగళవారం సాయంత్రం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కంటి వెలుగు, ఉపాధి హామీ, హరిత హారం, తెలంగాణ క్రీడా ప్రాంగణాలు తదితర అంశాలపై కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. కంటివెలుగు-2 కార్యక్రమం ద్వారా జిల్లాలో ఇప్పటివరకు 57640 మందికి నేత్ర పరీక్షలు నిర్వహించి, 14992 మందికి రీడిరగ్ గ్లాసెస్ అందించడం జరిగిందన్నారు. మరో 9589 మందికి ప్రిస్క్రిప్షన్ గ్లాసెస్ అవసరం ఉన్నాయని గుర్తించి, వారి వివరాలను ఆన్ లైన్ లో పంపించామని వివరించారు. ఇకముందు కూడా ఇదే తరహాలో శిబిరాలను విజయవంతంగా నిర్వహించాలని, ప్రతిరోజూ సగటున ఒక్కో శిబిరంలో 120 నుండి 130 మందికి కంటి పరీక్షలు జరిగేలా చూడాలన్నారు.
అదే సమయంలో శిబిరాలకు వచ్చే వారికి సంతృప్తికరంగా, పూర్తి నాణ్యతతో సేవలందేలా చొరవ చూపాలని హితవు పలికారు. దృష్టి లోపాలను పక్కాగా నిర్ధారిస్తూ, అవసరమైన వారికి మందులు, కంటి అద్దాలను అందించి సమస్యను దూరం చేసినప్పుడే కంటి వెలుగు కార్యక్రమం లక్ష్యం నెరవేరుతుందన్నారు. కాగా, శిబిరాల్లో నేత్ర పరీక్షలు చేయించుకున్న వారి వివరాలను ఆన్ లైన్లో నమోదు చేసే సందర్భంలో పొరపాట్లు, తప్పిదాలకు అవకాశం లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, వైద్యాధికారులు దీనిని పక్కాగా పర్యవేక్షణ చేయాలని కలెక్టర్ సూచించారు. సమయ పాలనను పాటిస్తూ, శిబిరాల్లో క్రమపద్ధతిలో ఆయా టేబుళ్ల వారీగా నేత్ర పరీక్షలు నిర్వహించాలని అన్నారు.
ఎంపీడీఓలు, ఎంపీఓలు, మండల వైద్యాధికారులు తమతమ పరిధిలో కొనసాగుతున్న కంటి వెలుగు శిబిరాలలో ప్రతి రోజు కనీసం ఒక శిబిరాన్ని అయినా తప్పనిసరిగా సందర్శిస్తూ ఈ కార్యక్రమం నిర్వహణ తీరును పర్యవేక్షించాలని ఆదేశించారు. ఎక్కడైనా సమస్యలు దృష్టికి వస్తే వెంటనే వాటిని పరిష్కరించేందుకు కృషి చేయాలన్నారు. కాగా, ఉపాధి హామీ పనులను విరివిగా గుర్తిస్తూ కూలీల ప్రాతినిధ్యం పెరిగేలా ప్రత్యేక దృష్టిని కేంద్రీకరించాలని సంబంధిత అధికారులకు సూచించారు.
హరితహారం కింద రోడ్లకు ఇరువైపులా, వివిధ ప్రాంతాల్లో నాటిన మొక్కల నిర్వహణ సజావుగా ఉండాలని, పల్లె ప్రకృతి, బృహత్ పల్లె ప్రకృతి వనాలతో పాటు అవెన్యూ ప్లాంటేషన్ ను క్షేత్ర స్థాయిలో వచ్చే శుక్రవారం నిశితంగా పరిశీలన జరిపిస్తామని అన్నారు. జిల్లా యంత్రాంగం మొత్తం పరిశీలన పనిలోనే నిమగ్నమవుతుందని, ఈ సందర్భంగా ఎక్కడైనా మొక్కల నిర్వహణ సక్రమంగా లేనిపక్షంలో సంబంధిత అధికారులు, సిబ్బందిని బాధ్యులుగా పరిగణిస్తూ సస్పెన్షన్ వేటు వేస్తామని కలెక్టర్ స్పష్టం చేశారు. అదేవిధంగా అన్ని చోట్ల తెలంగాణ క్రీడా ప్రాంగణాలను యుద్ధ ప్రాతిపదికన ఏర్పాటు చేయించాలని ఆదేశించారు.
16 – 59 సంవత్సరాల వయస్సు కలిగిన, పీఎఫ్, ఈఎస్‌ఐ సౌకర్యాలు లేని వివిధ రంగాల్లో కొనసాగుతున్న కూలీల పేర్లను ఈ-శ్రమ్ పోర్టల్ లో నమోదు చేయించాలన్నారు. తద్వారా ప్రమాదవశాత్తు మరణం సంభవిస్తే, బాధిత కుటుంబానికి ఉచిత బీమా కింద రూ. రెండు లక్షలు అందించబడతాయని అన్నారు. అలాగే గిరిజన సంక్షేమ శాఖ ద్వారా అమలవుతున్న ట్రైకార్ పథకం కింద అర్హులైన లబ్ధిదారులను క్షేత్ర స్థాయిలో ఎంపిక చేసి, సంబంధిత బ్యాంకర్ల వద్దకు పంపించాలని కలెక్టర్ సూచించారు.
వీడియో కాన్ఫరెన్స్ లో జెడ్పి సీఈఓ గోవింద్, డీఆర్డీఓ చందర్, మెప్మా పీ.డీ రాములు, డీఎంహెచ్‌ఓ డాక్టర్ సుదర్శనం, డీపీఓ జయసుధ, డీటీడబ్ల్యుఓ నాగూరావు, కంటి వెలుగు క్వాలిటీ టీంకు చెందిన డాక్టర్ స్వప్న తదితరులు పాల్గొన్నారు.