నిజామాబాద్, జనవరి 31
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : పోడు భూములకు సంబంధించిన ప్రక్రియను వారం రోజుల వ్యవధిలో పూర్తి చేయాలని, అర్హులైన వారికి ఆర్‌ఓఎఫ్‌ఆర్ పట్టాలను అందించేందుకు వీలుగా అవసరమైన అన్ని ఏర్పాట్లను పూర్తి చేసుకోవాలని కలెక్టర్ సి.నారాయణరెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు. కలెక్టర్ అధ్యక్షతన మంగళవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం మీటింగ్ హాల్‌లో ఆర్‌ఓఎఫ్‌ఆర్ జిల్లా స్థాయి కమిటీ సమావేశం నిర్వహించారు.
పోడు భూములకు సంబంధించి వచ్చిన క్లెయిమ్ లు, క్షేత్ర స్థాయిలో జరిపిన పరిశీలన వివరాలు, గ్రామ సభల తీర్మానాలు తదితర అంశాలపై సమావేశంలో కలెక్టర్ సమీక్షించారు. ఇప్పటికే వంద శాతం గ్రామ సభలు పూర్తయ్యాయని, టైం లైన్ మ్యాప్ ఆధారంగా క్షేత్ర స్థాయి పరిశీలన వివరాలను క్లెయిమ్ లతో జతపర్చడం జరిగిందని అధికారులు కలెక్టర్ దృష్టికి తెచ్చారు. ఇంకనూ ఏమైనా క్లెయిమ్ లు డివిజన్ స్థాయిలో పెండిరగ్లో ఉన్నట్లయితే, తక్షణమే వాటిని జిల్లా స్థాయి కమిటీ పరిశీలన నిమిత్తం పంపించాలని కలెక్టర్ ఆర్డీఓలను ఆదేశించారు.
తిరస్కరించిన క్లెయిమ్ లను మరోమారు క్షుణ్ణంగా పరిశీలించాలని, ప్రభుత్వం నిర్దేశించిన నిబంధనలకు లోబడి అర్హత కలిగి ఉన్న వారికి తప్పనిసరి న్యాయం జరిగేలా చూడాలన్నారు. జిల్లా స్థాయి కమిటీకి చేరిన నివేదికలను సైతం రెండు రోజుల్లో పరిశీలనను పూర్తి చేయాలని కలెక్టర్ నిర్దిష్టమైన గడువు విధించారు. క్లెయిమ్ ల ఆమోదం లేదా తిరస్కరణకు గురైన వాటికి సంబంధించి స్పష్టమైన ఆధారాలను పొందుపర్చాలని సూచించారు.
క్లెయిమ్‌ల పరిశీలన వివరాలను పక్కాగా ఎలాంటి తప్పిదాలకు తావులేకుండా కంప్యూటరీకరించాలని ఆదేశించారు. ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా నిర్ణీత డిజైన్ లో పట్టా పుస్తకాల పంపిణీకి చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు. సమావేశంలో అదనపు కలెక్టర్ బి.చంద్రశేఖర్, డీఎఫ్‌ఓ వికాస్ మీనా, జిల్లా గిరిజన సంక్షేమ శాఖ అధికారి నాగూరావు, ఆర్డీఓలు రాజేశ్వర్, శ్రీనివాస్, జిల్లా కమిటీ సభ్యులైన భీంగల్, మోపాల్, సిరికొండ మండలాల జెడ్పిటీసీలు చౌట్పల్లి రవి, కమలా బానోత్, మాలావత్ మాన్ సింగ్ తదితరులు పాల్గొన్నారు.