నిజామాబాద్, ఫిబ్రవరి 1
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజామాబాద్ జిల్లా కలెక్టర్గా రాజీవ్ గాంధీ హనుమంతు బుధవారం పదవీ బాధ్యతలు స్వీకరించారు. సాయంత్రం 4.40 గంటల సమయంలో సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం వద్దకు చేరుకున్న నూతన జిల్లా పాలనాధికారికి అధికారులు సాదరంగా స్వాగతం పలికారు. నేరుగా తన చాంబర్ కు చేరుకున్న కలెక్టర్ అధికారికంగా బాధ్యతలు చేపట్టారు.
అదనపు కలెక్టర్లు చిత్రామిశ్రా, బి.చంద్రశేఖర్, జిల్లా అటవీ శాఖ అధికారి వికాస్ మీనా తదితరులతో భేటీ అయ్యి జిల్లా స్థితిగతులు, స్థానిక పరిస్థితుల గురించి వారితో చర్చించారు. అంతకుముందు కొత్త కలెక్టర్ గా బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా జిల్లా పాలనాధికారిని ఆయన ఛాంబర్లో వివిధ శాఖల అధికారులు మర్యాదపూర్వకంగా కలిసి పరిచయం చేసుకున్నారు. అదనపు కలెక్టర్లతో పాటు జెడ్పి సీఈఓ గోవింద్, డీఆర్డీఓ చందర్, కలెక్టరేట్ ఏ.ఓ ప్రశాంత్, అన్ని శాఖలకు చెందిన జిల్లా అధికారులు, ఉద్యోగ సంఘాల నాయకులు కలెక్టర్ కు పూల బొకేలు అందించి స్వాగతం పలికారు.