నిజామాబాద్, ఫిబ్రవరి 1
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజామాబాద్‌లో మూడేళ్లకు పైగా విధులు నిర్వహించిన సందర్భంగా జిల్లాతో పెనవేసుకున్న అనుబంధం ఎన్నటికీ మర్చిపోలేనిది కలెక్టర్ సి.నారాయణరెడ్డి పేర్కొన్నారు. కలెక్టర్ సి.నారాయణరెడ్డికి నిజామాబాద్ లో పాలనాధికారిగా విధులు నిర్వహించి, వికారాబాద్ జిల్లాకు బదిలీపై వెళ్తున్న సందర్భాన్ని పురస్కరించుకుని బుధవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం సమావేశ మందిరంలో వీడ్కోలు సమావేశం నిర్వహించారు. అన్ని శాఖలకు చెందిన జిల్లా అధికారులు, ఉద్యోగ సంఘాల బాధ్యులు, రిటైర్డ్ ఉద్యోగుల సంఘం నాయకులు, వివిధ సంఘాల బాధ్యులు కలెక్టర్ పనితీరును, ఆయనతో కలిసి పని చేసిన అనుబంధాన్ని గుర్తు చేస్తూ ఘనంగా సన్మానించారు.
ఈ సందర్భంగా బదిలీపై వెళ్తున్న కలెక్టర్ సి.నారాయణరెడ్డి మాట్లాడుతూ, జిల్లాను విడిచి వెళ్తుండడం బాధగా ఉన్నప్పటికీ, ఉద్యోగులకు విధుల నిర్వహణలో బదిలీలు సహజమని ఒకింత భావోద్వేగానికి లోనయ్యారు. కలెక్టర్‌గా తాను జిల్లాలో బాధ్యతలు స్వీకరించిన నాటి నుండి కింది స్థాయి ఉద్యోగి మొదలుకుని ప్రతి శాఖకు చెందిన అధికారులందరూ అన్ని విషయాల్లోనూ ఎంతగానో సహకరించారని అన్నారు. వారి తోడ్పాటు కారణంగానే జిల్లాను ధాన్యం సేకరణ, హరిత హారం, ఉపాధి హామీ వంటి అనేక అంశాల్లో ముందంజలో నిలుపగలిగానని పేర్కొన్నారు.
ముఖ్యంగా పల్లె ప్రగతిని సమర్ధవంతంగా అమలు చేసిన ఫలితంగా స్వచ్ఛ సర్వేక్షన్ విభాగంలో నిజామాబాద్ జిల్లా జాతీయ స్థాయిలో గుర్తింపు సాధించగలిగిందని అన్నారు. వ్యాక్సినేషన్, క్షయ నిర్మూలనలోనూ అవార్డులు వచ్చాయని గుర్తు చేశారు. అన్నింటికి మించి కరోనా సంక్షోభంతో భయాందోళనలతో కూడిన పరిస్థితి నెలకొని ఉన్న సమయంలో అంగన్వాడీలు, ఆశ వర్కర్లు సహా వైద్యాధికారులు, సిబ్బంది పారా మెడికల్ స్టాఫ్ అహరహం శ్రమిస్తూ, ప్రజలకు తాము వెన్నంటి ఉన్నాము అనే భరోసాను కలిగించారని ప్రశంసించారు.
జిల్లాకు చెందిన మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, ఎమ్మెల్సీ కవిత తదితర ప్రజాప్రతినిధుల సహకారంతో జిల్లా యంత్రాంగానికి అవసరమైన అదనపు వనరులను సమకూర్చుకుని ప్రజలకు మరింత మెరుగైన సేవలందించగలిగామని కలెక్టర్ నారాయణరెడ్డి వారికి కృతజ్ఞతలు ప్రకటించారు. సర్పంచ్‌లు, ఇతర స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు కూడా పల్లె ప్రగతి వంటి కార్యక్రమాల్లో క్రియాశీలకంగా భాగస్వాములైన ఫలితంగానే జిల్లాకు చెందిన ఐదు గ్రామాలు జాతీయ స్థాయిలో ఉత్తమ గ్రామాలుగా ఎంపికయ్యాయని అన్నారు.
ఉద్యోగులను తన కుటుంబ సభ్యులుగా భావిస్తూ, వారితో సరైన మార్గదర్శనంలో పని చేయించగలిగానని, అందరి కృషి ఫలితంగానే జిల్లా అనేక రంగాల్లో ప్రగతి సాధించగలిగిందని పేర్కొన్నారు. ఉద్యోగులు ప్రతీకూల ఆలోచనలను దరిచేరనివ్వకుండా, తమ వద్దకు వచ్చే ప్రజలకు నిబంధలు లోబడి న్యాయం చేసేందుకు ప్రయత్నించాలని హితవు పలికారు. తాను అట్టడుగు స్థాయి నుండి పైకి వచ్చానని, తన వల్ల పది మందికి మేలు జరగాలనే తపనతో పని చేస్తానని అన్నారు.
ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ కె.ఆర్.నాగరాజు, అదనపు కలెక్టర్లు చిత్రామిశ్రా, బి.చంద్రశేఖర్ తదితరులు కలెక్టర్ నారాయణరెడ్డి కలిసి పని చేసిన అనుభవాలను నెమరువేసుకున్నారు. వీడ్కోలు సమావేశంలో కలెక్టర్ సతీమణి మనీష, అన్ని శాఖలకు చెందిన జిల్లా అధికారులు, కలెక్టరేట్ ఉద్యోగులతో పాటు జిల్లా ఉద్యోగ సంఘాల జె ఏ సి చైర్మన్ అలుక కిషన్, రెవెన్యూ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు రమణ్ రెడ్డి, ప్రభుత్వ అధికారుల సంఘం జిల్లా అధ్యక్షుడు రాములు, పీ ఆర్ టీ యూ సంఘం జిల్లా అధ్యక్షుడు మోహన్ రెడ్డి, రైస్ మిల్లర్స్ అసోసియేషన్ ప్రతినిధి వి.మోహన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.