కామారెడ్డి, ఫిబ్రవరి 1
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : గ్రామాల్లో ప్రతిరోజు తడి, పొడి చెత్తను గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో ట్రాక్టర్ ద్వారా సేకరించాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. కామారెడ్డి కలెక్టరేట్లో బుధవారం స్వచ్ఛ భారత్ మిషన్, పంచాయతీరాజ్ చట్టం 2018 లేఅవుట్ రూల్స్, బిల్డింగ్ రెగ్యులేషన్స్ పై మండల స్థాయి అధికారులకు అవగాహన సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి జిల్లా కలెక్టర్ ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు.
ట్రాక్టర్ ద్వారా సేకరించిన చెత్తను డంపింగ్ యార్డ్ కు తరలించి తడిపొడి చెత్తను వేరుచేసి సేంద్రియ ఎరువులు తయారు చేయాలని తెలిపారు. సేంద్రీయ ఎరువులను విక్రయించి వచ్చిన ఆదాయాన్ని రిజిస్టర్ లో నమోదు చేయాలని చెప్పారు. పంచాయతీ ఆదాయాన్ని పెంపొందించుకోవాలని సూచించారు. గ్రామపంచాయతీ ట్రాక్టర్లను జిపిఎస్ ద్వారా అధికారులు పరిశీలన చేయాలని చెప్పారు.
ప్లాస్టిక్ వాడకమును తగ్గించే విధంగా గ్రామీణులకు అవగాహన కల్పించాలని పేర్కొన్నారు. అన్ని గ్రామాలలో క్రీడా ప్రాంగణాలను అధికారులు త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు. ఉపాధి హామీ పనులకు కూలీలు అధిక సంఖ్యలో వచ్చే విధంగా చూడాలన్నారు. నీటి సంరక్షణ పనులు గుర్తించి గ్రామీణులకు ఉపాధి కల్పించాలని చెప్పారు.
లేఅవుట్ రూల్స్, బిల్డింగ్ రెగ్యులేషన్స్ లపై అధికారులు అవగాహన కల్పించారు. సమావేశంలో జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ వెంకటేష్ దోత్రే, డిఆర్‌డిఓ సాయన్న, డిపిఓ శ్రీనివాసరావు, స్వచ్ఛ భారత్ మిషన్ సమన్వయకర్తలు నారాయణ, మురళి కృష్ణ, డీఎల్పీఓలు, ఎంపీడీవోలు, ఎంపీఓలు, అధికారులు పాల్గొన్నారు.