నిజామాబాద్, ఫిబ్రవరి 4
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా ప్రజలకు సబ్సిడీపై నిత్యావసర సరుకులు అందిస్తున్న రేషన్ దుకాణాల నిర్వహణ తీరును పకడ్బందీగా పర్యవేక్షించాలని అదనపు కలెక్టర్ బి.చంద్రశేఖర్ సంబంధిత అధికారులను ఆదేశించారు. శనివారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో రేషన్ డీలర్లు, పౌర సరఫరాల శాఖ అధికారులతో అదనపు కలెక్టర్ సమీక్షా సమావేశం నిర్వహించారు.
ప్రతి రేషన్ షాపులో బోర్డును, సరుకుల స్టాక్ వివరాలను ప్రదర్శించాలని, రేషన్ కేటాయింపులు, వాటి పంపిణీకి సంబంధించిన వివరాలను నిర్ణీత నమూనాలో రిజిస్టర్ లలో నమోదు చేయడం, ఫిర్యాదుల పెట్టె, ఈ-పాస్ మెషిన్ ఆధారంగా సరుకుల పంపిణీ, క్యూ లైన్ పద్ధతి తదితర ప్రక్రియలన్ని పక్కాగా జరిగేలా చూడాలన్నారు. క్షేత్రస్థాయిలో విరివిగా రేషన్ షాపులను ఆకస్మికంగా తనిఖీలు చేయాలని ఆదేశించారు.
తనిఖీల్లో ఏవైనా లోటుపాట్లను, తప్పిదాలను గుర్తిస్తే, తగిన ఆధారాలతో నివేదిక సమర్పించాలని సూచించారు. అక్రమాలకు పాల్పడే వారిని ఎంతమాత్రం ఉపేక్షించకూడదని, అదే సమయంలో నిజాయితీగా పనిచేసే వారిని ప్రోత్సహించాలన్నారు. ప్రతీ నెల నిర్ణీత గడువులోగా డీలర్లు రేషన్ సరుకులు దిగుమతి చేసుకుని, సకాలంలో వాటిని ప్రజలకు పంపిణీ చేసేలా పక్కాగా పర్యవేక్షణ చేయాలన్నారు.
సన్న బియ్యం, దొడ్డు బియ్యం అనే తేడా చూపకుండా, వచ్చిన నిల్వలను వచ్చిన విధంగా రేషన్ షాపులకు కేటాయించాలని ఎం ఎల్ ఎస్ పాయింట్ల నిర్వాహకులను ఆదేశించారు. మోడల్ రేషన్ దుకాణాల కోసం అనువుగా ఉన్న రేషన్ షాపుల జాబితా అందించాలని అధికారులకు సూచించారు. కాగా, ధాన్యం సేకరణ ప్రక్రియకు ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు రేషన్ డీలర్లు గన్నీ బ్యాగులు తిరిగి వాపస్ చేయాలని అదనపు కలెక్టర్ బి.చంద్రశేఖర్ సూచించారు.
ఎంఎల్‌ఎస్ పాయింట్ల ఇంచార్జ్ లు నిర్దేశిత కేటాయింపులకు అనుగుణంగా రేషన్ డీలర్ల వద్ద నుండి గన్నీ బ్యాగులు వెనక్కి తీసుకోవాలని ఆదేశించారు. ఈ మేరకు రేషన్ డీలర్లు పూర్తిస్థాయిలో సహకరించాలని అన్నారు. సమీక్షా సమావేశంలో డీ.ఎస్.ఓ చంద్రప్రకాశ్ తదితరులు పాల్గొన్నారు.