కామారెడ్డి, ఫిబ్రవరి 5
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : గర్భస్థ పిండ పరీక్ష నియంత్రణ పై స్కానింగ్ కేంద్రాల నిర్వహకులకు, ఐఎంఏ, రెడ్ క్రాస్ ప్రతినిధులకు, జిల్లా అధికారులకు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వైద్యులకు వైద్య శాఖ అధికారులు అవగాహన కార్యక్రమాన్ని మూడు నెలలకు ఒకసారి నిర్వహించాలని జిల్లా న్యాయమూర్తి శ్రీదేవి అన్నారు. కామారెడ్డి కలెక్టరేట్ లోని కాన్ఫరెన్స్ హాల్లో శనివారం గర్భధారణ, గర్భస్థ పిండ ప్రక్రియ నియంత్రణ పై జిల్లా స్థాయి అధికారులు సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సమావేశానికి జిల్లా న్యాయమూర్తి ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. ప్రతి నెల స్కానింగ్ కేంద్రాలను జిల్లా స్థాయి వైద్యాధికారులు తనిఖీలు చేయాలని సూచించారు. గ్రామస్థాయిలో పోలీస్ , ఆరోగ్యశాఖ అధికారులు సమన్వయంతో లింగ నిర్ధారణ నిషేధ చట్టంపై అవగాహన కల్పించాలని తెలిపారు. జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ మాట్లాడారు. జిల్లాలో 28 స్కానింగ్ కేంద్రాలు ఉన్నాయని తెలిపారు.
అన్ని స్కానింగ్ కేంద్రాల్లో సిసి కెమెరాలు ఉండేవిధంగా చూడాలన్నారు. ప్రైవేట్ ఆస్పత్రిలో లింగ నిర్ధారణ పరీక్షలు చేసి వివరాలు తెలియజేస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. సమావేశంలో అడిషనల్ ఎస్పీ అన్యోన్య, జిల్లా వైద్యాధికారి లక్ష్మణ్ సింగ్, వైద్యురాలు శిరీష, జిల్లా రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ రాజన్న, అధికారులు వేణుగోపాల్, చలపతి పాల్గొన్నారు.