కామారెడ్డి, ఫిబ్రవరి 6
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : పొగాకు నియంత్రణ పై జూనియర్ కళాశాలల’ డిగ్రీ కళాశాలల విద్యార్థులకు అవగాహన కల్పించాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. కామారెడ్డి కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాల్లో పొగాకు, డ్రగ్స్ నియంత్రణ పై అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ జితేష్ వి పాటిల్ మాట్లాడారు.
పొగ తాగడం వల్ల విద్యార్థులకు కలిగే అనర్థాలను వివరించాలని సూచించారు. మెడికల్ షాపుల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని తెలిపారు. సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం వల్ల కలిగే ప్రయోజనాలను వివరించారు. వైద్యులు ధ్రువీకరించిన మందుల చిట్టి ఆధారంగా మందులను మెడికల్ నిర్వాహకులు అందజేయాలని పేర్కొన్నారు.
మెడికల్ నిర్వాహకులు రికార్డులను సక్రమంగా నిర్వహించాలని కోరారు. సమావేశంలో శిక్షణ కలెక్టర్ శివేంద్ర ప్రతాప్, జిల్లా ఎక్సైజ్ అధికారి ఎస్. రవీందర్ రాజు, జిల్లా నోడల్ అధికారి షేక్ సలాం, జిల్లా బాలల సంరక్షణ అధికారి స్రవంతి, డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ కిష్టయ్య, అధికారులు పాల్గొన్నారు.