నిజామాబాద్, ఫిబ్రవరి 6
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రజా సమస్యల సత్వర పరిష్కారమే ధ్యేయంగా ప్రతి సోమవారం నిర్వహిస్తున్న ప్రజావాణి కార్యక్రమానికి ప్రాధాన్యతనిస్తూ పెండిరగ్ ఉన్న అర్జీలను సత్వరమే పరిష్కరించాలని, ఏ ఒక్క అర్జీ కూడా పెండిరగ్ లో ఉండకూడదని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు అధికారులకు సూచించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 109 ఫిర్యాదులు అందాయి. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ఫిర్యాదుదారులు తమ సమస్యలను కలెక్టర్‌తో పాటు అదనపు కలెక్టర్లు చిత్రామిశ్రా, చంద్రశేఖర్, జెడ్పి సీఈఓ గోవింద్ లకు విన్నవిస్తూ అర్జీలు సమర్పించారు.
అర్జీలను వెంటదివెంట పరిశీలన జరుపుతూ, సమస్యలను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. పరిష్కరించిన అర్జీల వివరాలను ఆన్‌లైన్‌లో అప్లోడ్ చేయడంతో పాటు అర్జీదారులకు సమాచారం అందించాలని సూచించారు. కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
ప్రభుత్వ ప్రాధాన్యతలు పక్కాగా అమలయ్యేలా చూడాలి
ప్రభుత్వ ప్రాధాన్యత కలిగిన కార్యక్రమాలు జిల్లాలో పక్కాగా అమలయ్యేలా చూడాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు అధికారులను ఆదేశించారు. ప్రజావాణి కార్యక్రమం అనంతరం కలెక్టర్ అధికారులకు వివిధ అంశాలపై మార్గనిర్దేశం చేశారు. మండల ప్రత్యేక అధికారులు వారంలో కనీసం రెండు పర్యాయాలు క్షేత్రస్థాయిలో పర్యటించాలని, మన ఊరు – మన బడి, కంటి వెలుగు, హరితహారం, ఆస్తి పన్ను వసూళ్ల ప్రగతి, వార్షిక పరీక్షల సన్నద్ధత వంటి అంశాలను నిశితంగా పరిశీలించాలన్నారు.
క్షేత్ర పర్యటనలో భాగంగా గమనించిన అంశాలను సంబంధిత మండల, జిల్లా స్థాయి అధికారుల దృష్టికి తీసుకెళ్లి వాటి పరిష్కారానికి చొరవ చూపాలని హితవు పలికారు. ప్రధానంగా ఆర్ధిక సంవత్సరం ముగింపు దశకు చేరుకున్న నేపథ్యంలో ఆస్తి పన్ను నిర్దేశిత లక్ష్యం మేరకు రాబట్టేలా ప్రణాళికాబద్ధంగా వ్యవహరించాలని కలెక్టర్ ఆదేశించారు. హరితహారం కార్యక్రమానికి ప్రత్యేక ప్రాధాన్యతనివ్వాలని, మొక్కల నిర్వహణ గాడి తప్పకుండా పకడ్బందీ చర్యలు చేపట్టాలన్నారు.
రోడ్లకు ఇరువైపులా నాటిన మొక్కలు ఎక్కడైనా పాడైపోతే, తక్షణమే వాటి స్థానంలో కొత్త మొక్కలను ఏర్పాటు చేయించాలన్నారు. ఎండల తీవ్రత క్రమంగా పెరిగే అవకాశాలు ఉన్నందున మొక్కలకు క్రమం తప్పకుండా నీటిని అందించేలా పర్యవేక్షణ జరపాలని సూచించారు. పదవ తరగతి, ఇంటర్ వార్షిక పరీక్షలు సమీపించినందున విద్యార్థులను అన్ని విధాలుగా సన్నద్ధం చేయాలని, ప్రత్యేక తరగతులు, స్టడీ అవర్స్ నిర్వహించాలని ఆదేశించారు.
సమాచార లోపానికి తావులేకుండా ఆయా శాఖల అధికారులు పరస్పర సమన్వయంతో పనిచేస్తూ, ప్రభుత్వ కార్యక్రమాల విజయవంతానికి అంకిత భావంతో కృషి చేయాలని హితవు పలికారు. సమాచారాన్ని పరస్పరం పంచుకునేందుకు వాట్సప్ గ్రూప్ సేవలను వినియోగించుకోవాలని సూచించారు.