నిజామాబాద్, ఫిబ్రవరి 7
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రతి ఇంటిలో ప్రతి ముఖంలో సంతోషమే ప్రభుత్వ లక్ష్యమని నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే గణేష్ గుప్తా పేర్కొన్నారు. మంగళవారం ఆయన కల్యాణ లక్ష్మీ చెక్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా గణేష్ బిగాల మాట్లాడుతూ నిజామాబాద్ నగరానికి చెందిన 198లబ్దిదారులకు 298 కల్యాణ లక్ష్మీ చెక్కులకు గాను రు.1,98,22,968 అందజేస్తున్నట్టు తెలిపారు.
ప్రతి ఇంటికి సంక్షేమం-ప్రతి ఒక్కరి ముఖంలో సంతోషమే ప్రభుత్వ ధ్యేయమన్నారు. భారత ప్రజలంతా తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధి సంక్షేమ పథకాలని గమనిస్తున్నారని తెలిపారు. దేశానికి కేసీఆర్ నాయకత్వం కావాలని ఆకాంక్షిస్తున్నారని, సంక్షేమ పథకాలే తెలంగాణకు రోల్ మోడల్ గా వెల్లడిరచారు. ఆడ బిడ్డల పెళ్లి చేసే బాధ్యతని ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకున్నారన్నారు.
మహిళలు లేకుండా సృష్టి లేదని, ఆడ బిడ్డ పుట్టిన మగ బిడ్డ పుట్టిన సంతోషంగా దైవ ఆజ్ఞగా స్వాగతించాలని ఆయన సూచించారు. తాను ఎమ్మెల్యేగా ఉన్నంత కాలం నూతన వదు-వరులకు కానుకగా నూతన వస్త్రాలు ఇస్తానని స్పష్టం చేశారు.
గర్భిణి స్త్రీలకు అంగన్ వాడి కేంద్రాల్లో పౌష్టికాహారం, ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రసవిస్తే కేసీఆర్ కిట్ తో పాటుగా విడతల వారీగా రు.12వేలు నగదు అందిస్తున్నామన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని ప్రగతి పథంలో ముందుకు తీసుకెళ్తున్న జాతీయ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించాలని, ఆరోగ్యంగా జీవించాలని కోరారు. కార్యక్రమంలో నగర మేయర్ దండు నీతూ కిరణ్, నుడ చైర్మన్ ప్రభాకర్ రెడ్డి, నుడ డైరెక్టర్లు, కార్పొరేటర్లు, బిఆర్‌ఎస్ నాయకులు పాల్గొన్నారు.