కామారెడ్డి, ఫిబ్రవరి 11
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రతి ఒక్కరికి సమాన న్యాయం అందే విధంగా జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ద్వారా ఉచిత న్యాయ సేవలు పొందవచ్చని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. కామారెడ్డి జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ శనివారం జాతీయ లోకాదాలత్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కలెక్టర్ ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు.
ఏళ్ల తరబడి పెండిరగ్ ఉన్న సమస్యలకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని తెలిపారు. గొడవలు కోర్టు ద్వారా పరిష్కారం అవుతాయని నమ్మకం ప్రజలకు ఉందని చెప్పారు. కక్షి దారులకు లీగల్ సర్వీస్ అథారిటీ తమ వంతు సహకారం అందిస్తుందని పేర్కొన్నారు. ఏళ్ల తరబడి కేసులు పెండిరగ్లో ఉండడం వల్ల కక్షదారులు నష్టపోతారని చెప్పారు. పేద ప్రజలు, ఆర్థికంగా వెనుకబడిన వారికి ఉచిత న్యాయ సహాయం, సలహాలు లభిస్తాయని తెలిపారు.
సమావేశంలో జిల్లా జడ్జి, చైర్మన్ శ్రీదేవి మాట్లాడారు. జిల్లా ప్రజలు జాతీయ లోక్ అదాలత్ ద్వారా రాజీ మార్గమే రాజమార్గంగా భావించాలని కోరారు. ప్రతి ఒక్కరికి న్యాయం పొందే హక్కును రాజ్యాంగం కల్పించిందని తెలిపారు. ఈ అవకాశాన్ని జిల్లా ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని చెప్పారు. కార్యక్రమంలో ఎస్పీ శ్రీనివాస్ రెడ్డి, జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ కార్యదర్శి కిరణ్ కుమార్, న్యాయమూర్తులు, న్యాయవాదులు పాల్గొన్నారు.