నిజామాబాద్, ఫిబ్రవరి 11
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ రాష్ట్ర ఇంటర్ బోర్డు కార్యదర్శి ఆదేశాల మేరకు 2022-23 విద్యా సంవత్సరానికి గాను ఈ నెల 15వ తేదీ నుండి మార్చి రెండవ తేదీ వరకు మూడు దశలలో జిల్లాలోని జూనియర్ కళాశాలలో ప్రాక్టికల్ పరీక్షలు (ప్రయోగాత్మక పరీక్షలు) నిర్వహించనున్నట్లు జిల్లా ఇంటర్ విద్య అధికారి రఘురాజ్ తెలిపారు.
ఈనెల 15వ తేదీ నుండి 20వ తేదీ వరకు మొదటి విడుత, 21వ తేదీ నుండి 25వ తేదీ వరకు రెండవ విడుత, ఈ నెల 26వ తేదీ నుండి మార్చి రెండవ తేదీ వరకు మూడవ విడుత లో జిల్లాలోని ప్రాక్టికల్ పరీక్షా కేంద్రాల కోసం ఎంపిక చేసిన జూనియర్ కళాశాలలో ప్రాక్టికల్స్ పరీక్షలను నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ప్రభుత్వ జూనియర్ కళాశాలలు, ప్రైవేట్ జూనియర్ కళాశాలలు మోడల్ జూనియర్ కళాశాలలో, సాంఘిక సంక్షేమ రెసిడెన్షియల్ జూనియర్ కళాశాలలు, గిరిజన సంక్షేమ జూనియర్ కళాశాలలు, బిసి సంక్షేమ జూనియర్ కళాశాలలో, మైనారిటీ జూనియర్ కళాశాలలు, కేజీబీవీ జూనియర్ కళాశాలల ప్రిన్సిపాల్‌లు ప్రాక్టికల్ పరీక్షలకు విద్యార్థులందరికీ తమ కళాశాల లాగిన్ నుండి హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకొని ఇవ్వాలని ఆదేశించారు.
ప్రైవేట్ కళాశాలల యాజమాన్యాలు కానీ ప్రిన్సిపాల్‌లు కానీ విద్యార్థుల నుండి ఫీజుల వసూలు కోసం ఎలాంటి ఒత్తిళ్లు చేయరాదని ఆదేశించారు. జిల్లాలో మొత్తం జనరల్, ఒకేషనల్ 19,744 మంది విద్యార్థులు ఈ ప్రాక్టికల్ పరీక్షలకు హాజరవుతున్నారని జిల్లా ఇంటర్ విద్యా అధికారి తెలిపారు. జిల్లాలో మొత్తం జనరల్ ప్రాక్టికల్ పరీక్షలకు 70 పరీక్ష కేంద్రాలను, ఒకేషనల్ పరీక్షలకు ఏడు పరీక్ష కేంద్రాలను కేటాయించినట్లు తెలిపారు. అలాగే పరీక్షల నిర్వహణలో గాని, హాల్ టికెట్లు సమస్య కానీ మరే ఇతర సమస్య అయిన జిల్లా ఇంటర్ విద్య అధికారి కార్యాలయానికి సమాచారం అందజేసినట్లయితే సమస్య పరిష్కారానికి కృషి చేస్తామని జిల్లా ఇంటర్ విద్యాధికారి తెలిపారు.
ఆయా కళాశాలల ప్రిన్సిపాల్‌లు సమస్య గుర్తించి తమకు తెలియజేయాలని అన్నారు. ప్రాక్టికల్స్ పరీక్షలు ఉదయం, మధ్యాహ్నం రెండు సెషన్స్ లలో నిర్వహిస్తున్నామని తెలియజేశారు. ఆయా కళాశాలలో పరీక్షలకు హాజరయ్యే విద్యార్థుల సంఖ్యను బట్టి వారి యొక్క పరీక్ష తేదీలను నిర్ణయించడం జరిగిందని తెలిపారు. ప్రతి విద్యార్థి హాల్ టికెట్‌లో సెంటర్ పేరు, పరీక్ష తేదీ, సబ్జెక్టు సరిచూసుకోవాలని పరీక్షల నిర్వహణలో ఎలాంటి ఇబ్బందులు ఎదురుకాకుండా ముందు జాగ్రత్త చర్యలను తీసుకోవాలని పరీక్ష కేంద్రాలకు ఎంపిక చేసిన కళాశాలల ప్రిన్సిపాల్‌లను ఆ జిల్లా ఇంటర్ విద్య అధికారి ఆదేశించారు.