దళిత బంధు యూనిట్లను పరిశీలించిన ఎస్సీ కార్పొరేషన్‌ ఛైర్మన్‌

నిజామాబాద్‌, ఫిబ్రవరి 11

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్‌ ఛైర్మన్‌ బండ శ్రీనివాస్‌ శనివారం నిజామాబాద్‌ జిల్లాలో పర్యటించారు. ఎస్సీ కుటుంబాల సమగ్ర అభ్యున్నతి కోసం తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న దళిత బంధు పథకం యూనిట్లను పరిశీలించారు. ఎస్సీ కార్పొరేషన్‌ ఈ.డీ రమేష్‌ తో కలిసి మోర్తాడ్‌ మండలం దొన్పాల్‌ గ్రామంలో దళిత బంధు పథకం కింద పత్రి భాస్కర్‌ ఏర్పాటు చేసుకున్న డ్రోన్‌ స్ప్రేయర్‌ యూనిట్‌ ను పరిశీలించారు.

డ్రోన్‌ సహాయంతో పంటలకు క్రిమిసంహారక మందు పిచికారీ చేస్తున్న విధానాన్ని ప్రయోగాత్మకంగా పరిశీలించారు. డ్రోన్‌ స్ప్రేయర్‌ పనితీరు గురించి, దీని ద్వారా ఆర్జిస్తున్న లాభాలు, రైతుల నుండి లభిస్తున్న స్పందన గురించి లబ్ధిదారుడిని చైర్మన్‌ శ్రీనివాస్‌ వివరాలు అడిగి తెలుసుకుని సంతృప్తి వ్యక్తం చేశారు. అలాగే, ఆర్మూర్‌ పట్టణంలో దళిత బంధు లబ్ధిదారు అయిన తీగల శంకర్‌ నిర్వహిస్తున్న డెయిరీ యూనిట్‌ ను సందర్శించారు.

ఈ సందర్భంగా చైర్మన్‌ శ్రీనివాస్‌ మాట్లాడుతూ, ఎస్సీ కుటుంబాల స్థితిగతుల్లో సమూలమైన మార్పులు తేవాలని సంకల్పంతో ముఖ్యమంత్రి కేసీఆర్‌ దేశంలోనే మరెక్కడా లేనివిధంగా రాష్ట్రంలో దళిత బంధు పథకాన్ని అమలు చేస్తున్నారని అన్నారు. ఈ పథకం కింద లబ్ధిదారులకు పెద్ద ఎత్తున ఆర్థిక తోడ్పాటును సమకూరుస్తూ, యూనిట్లను ఏర్పాటు చేయిస్తుండడంతో అనేక కుటుంబాలు స్వయం సమృద్ధి దిశగా ముందుకు సాగుతున్నాయని పేర్కొన్నారు.

దళిత బంధు పథకాన్ని దశల వారీగా అన్ని ఎస్సీ కుటుంబాలకు అమలు చేయడం జరుగుతుందని, ఈ మేరకు ప్రభుత్వం బడ్జెట్‌ లో ప్రత్యేకంగా నిధులు కేటాయిస్తోందని గుర్తు చేశారు. లబ్ధిదారులు ప్రభుత్వ తోడ్పాటును పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకుని ఆర్థిక స్వావలంబన సాధించాలని, మరో పది మందికి ఉపాధి కల్పించాలని ఆకాంక్షించారు.

Check Also

దివ్యాంగులకు క్రీడా పోటీలు

Print 🖨 PDF 📄 eBook 📱 నిజామాబాద్‌, నవంబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »