నిజామాబాద్, ఫిబ్రవరి 11
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ దారి దీపాలు పుస్తకం భవిష్యత్ తరాలకు, పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే ఉద్యోగార్థులకు ఉపయుక్తమైన గ్రంథమని ఈ గ్రంథ రూపకల్పనలో అందులో నిజాంబాద్‌లోని మహనీయులకు చోటు కల్పించడం ఆనందదాయకమని ప్రముఖ కవి వీ నరసింహారెడ్డి అన్నారు. శనివారం నర్సింగ్‌పల్లి వెంకటేశ్వర స్వామి ఆలయంలోని విశ్వవేదికపై జరిగిన తెలంగాణ భాషా సాంస్కృతిక మండలి సారథి డాక్టర్ గంటా జలంధర్ రెడ్డి సంపాదకత్వంలో వెలువడిన తెలంగాణ దారి దీపాలు మొదటి సంచిక పరిచయ సభలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు.
మహనీయుల జీవితాలను గ్రంథస్తం చేయడం వల్ల భావితరాలకు స్ఫూర్తిదాయకమవుతుందని ఆయన అన్నారు. కార్యక్రమంలో గౌరవ అతిథిగా పాల్గొన్న ఆకాశవాణి సంచాలకులు సూర్య ప్రకాశ మాట్లాడుతూ ప్రతి ప్రాంతానికి సమాజానికి చరిత్ర ఉంటుందని దాని వెనుక త్యాగం ఉంటుందని వాటిని అవగతం చేసుకుంటే జీవితం ఫలవంతంగా సాగుతుందని ఈ దారి దీపాలు పుస్తకం ఎంతో ఉపయోగకరమని అభినందించారు.
ఈ గ్రంథంలో పేర్కొన్న నంబి శ్రీధర్ రావు, సేనాపతి భాష్యకాచార్యులు, యాదగిరి ఆచార్యులు, సిహెచ్ మధు, ఆరెట్టినారాయణ, చిందుల నీలమ్మ, లోకమలహరి దారి దీపాలకు చోటిచ్చిన తెలంగాణ భాష సంస్కృతిక మండలి అధ్యక్షులు గంటా జలంధర్ ను అభినందించారు. సభకు అధ్యక్షత వహించిన తెలంగాణ రచయితల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు ఘనపురం దేవేందర్ మాట్లాడుతూ మనుషులలోని మంచిని గుర్తించడం, త్యాగ గుణాన్ని విస్తరింప చేయడం చరిత్ర లక్షణమని అన్నారు.
కార్యక్రమంలో స్పందన తెలియజేసిన గంటా జలంధర్ రెడ్డి మాట్లాడుతూ తాను ఈ పుస్తకం తీసుకురావడానికి సౌజన్యమూర్తి సాగర్ సిమెంట్స్ ఎండి డాక్టర్ ఆనంద్ రెడ్డి, వ్యాసకర్తలతో పాటు ఎందరో సహకరించారని కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో తెలంగాణ రచయితల సంఘం అధ్యక్షులు నరాల సుధాకర్, సాయిబాబు, విపి చందన్ రావు, దారం గంగాధర్, ప్రణవి, రజిత, డాక్టర్ సరోజినీ వింజామార, డాక్టర్ తల్లా వజ్జల మహేశ్ బాబు, డాక్టర్ బలాష్ట్ మల్లేష్, కాసర్ల నరేష్, నరసింహ స్వామి, భాస్కర్ రెడ్డి, నాగరాజు, సంజీవరెడ్డి, భరత్, తొగర్ల సురేశ్ తదితరులు పాల్గొన్నారు.