కామారెడ్డి, ఫిబ్రవరి 14
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లా బాన్సువాడ కేంద్రానికి చెందిన మానస 25 గర్భిణీ స్త్రీకి ప్రభుత్వ వైద్యశాల బాన్సువాడలో అత్యవసరంగా ఓ నెగిటివ్ రక్తం అవసరం కావడంతో వారికి కావాల్సిన రక్తం రక్తనిధి కేంద్రాలలో లభించకపోవడంతో వారి కుటుంబ సభ్యులు రెడ్ క్రాస్ జిల్లా మరియు ఐవిఎఫ్ తెలంగాణ రాష్ట్ర రక్తదాతల సమూహ సమన్వయకర్త డాక్టర్ బాలును సంప్రదించారు.
పట్టణ కేంద్రానికి చెందిన రక్తదాతల సమూహ ఉపాధ్యక్షుడు కిరణ్ కుమార్‌కు తెలియజేయడంతో వెంటనే మానవతా దృక్పథంతో స్పందించి 50 వసారి రక్తదానం చేశారన్నారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కైలా శ్రీనివాస్ రావు మాట్లాడుతూ గత 15 సంవత్సరాలుగా కామారెడ్డి రక్తదాతల సమూహం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అత్యవసర పరిస్థితుల్లో ఉన్నవారికి కావాల్సిన రక్తాన్ని అందజేస్తూ కామారెడ్డి రక్తదాతల సమూహం అంటేనే తెలంగాణ రాష్ట్రానికే ఆదర్శంగా నిలిచారన్నారు.
కామారెడ్డి రక్తదాతల సమూహ అధ్యక్షుడు డాక్టర్ వేదప్రకాష్ మాట్లాడుతూ తలసేమియా చిన్నారుల కోసం గడిచిన 5 నెలల లోనే 600 యూనిట్లకు పైగా రక్తాన్ని సేకరించామని, ఆపదలో ఉన్న వారికి అండగా నిలబడేందుకు రక్తదాతల సమూహం ఎల్లవేళలా సిద్ధంగా ఉంటుందని, రాష్ట్రవ్యాప్తంగా 3500 మందికి పైగా రక్తదాతలు సమూహంలో సభ్యులుగా ఉన్నారని కామారెడ్డికి మాత్రమే పరిమితం కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా రక్తదాన కార్యక్రమాలను నిర్వహిస్తున్నామన్నారు.
50 సార్లు రక్తదానం చేయడం అంటే సాధారణ విషయం కాదని గర్భిణీ స్త్రీల కోసం, గుండె ఆపరేషన్ల నిమిత్తమై, డెంగ్యూ వ్యాధితో బాధపడుతున్న వారి కోసం కావాల్సిన రక్తాన్ని సకాలంలో అందజేసి 50 మంది ప్రాణాలను కాపాడిన కిరణ్ అభినందించడం జరిగింది. కిరణ్ స్ఫూర్తిగా తీసుకొని రక్తదానం చేయడానికి యువత ముందుకు రావాలన్నారు. కార్యక్రమంలో సమూహ ఉపాధ్యక్షుడు జమీల్ కార్యదర్శి, శ్రీకాంత్ రెడ్డి బ్లడ్ బ్యాంక్ టెక్నీషియన్లు చందన్ ఏసు గౌడ్ పాల్గొన్నారు.