కామారెడ్డి, ఫిబ్రవరి 14
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రైవేటుకు ధీటుగా ప్రభుత్వ కళాశాలలు సత్ఫలితాలు సాధించాలని జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ వెంకటేష్ దోత్రే అన్నారు. కామారెడ్డి ప్రభుత్వ జూనియర్ కళాశాల వార్షికోత్సవ వేడుకలు మంగళవారం నిర్వహించారు. ఈ వేడుకలకు స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ వెంకటేష్ దోత్రే హాజరై మాట్లాడారు.
ప్రభుత్వం ప్రభుత్వ కళాశాలలో మౌలిక వసతులు కల్పించిందని, అనుభవజ్ఞులైన అధ్యాపకులతో బోధన చేపడుతుందని తెలిపారు. ప్రస్తుతం కళాశాలలో 580 మంది విద్యార్థులు ఉన్నారని వారి సంఖ్యను 900 అయ్యే విధంగా అధ్యాపకులు చూడాలని చెప్పారు. విద్యార్థులకు కష్టపడేతత్వం ఉంటే విజయం సాధించడం సులభం అవుతుందని పేర్కొన్నారు. విద్యార్థి దశలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం మార్కులు కీలకమైనవని విద్యార్థులు భావించాలని సూచించారు.
విద్యార్థులు అన్ని రంగాల్లో రాణించాలని తెలిపారు. లక్ష్యసాధన కోసం పట్టుదలతో ఇష్టపడి సాధన చేయాలని చెప్పారు. కార్యక్రమంలో నోడల్ అధికారి షేక్ సలాం మాట్లాడారు. తమ కళాశాలలో ఒకేషనల్ కోర్సులు ఉన్నాయని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు.
కళాశాల నివేదికను చదివి వినిపించారు. ఈ సందర్భంగా విద్యార్థులు పలు సాంస్కృతిక కార్యక్రమాలు చేపట్టారు. క్రీడా పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులను ప్రధానం చేశారు. కార్యక్రమంలో జిల్లా పరీక్షల నియంత్రణ కమిటీ ప్రతినిధులు అజ్మల్ ఖాన్, నిజాం, ప్రిన్సిపల్ అసోసియేషన్ అధ్యక్షుడు శ్రీనాథ్, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.