నిజామాబాద్, ఫిబ్రవరి 15
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : పోడు భూములకు సంబంధించి దాఖలైన క్లెయిమ్‌లను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు అధికారులను ఆదేశించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయ సమావేశ మందిరంలో బుధవారం రెవెన్యూ, ఫారెస్ట్, మండల పరిషత్ తదితర అధికారులతో కలెక్టర్ సమీక్షా సమావేశం నిర్వహించారు.
క్షేత్ర స్థాయిలో గుర్తించిన పలు సమస్యలను అధికారులు ప్రస్తావించగా, వాటి పరిష్కారానికి అనుసరించాల్సిన పద్ధతుల గురించి కలెక్టర్ మార్గనిర్దేశం చేశారు. పోడు భూములకు పట్టా పాస్ బుక్కులు అందించాలని ప్రభుత్వం నిర్ణయించినందున, నిర్ణీత గడువులోపు దాఖలైన క్లెయిమ్‌లు అన్నింటినీ సమగ్ర పరిశీలన జరిపి పక్షం రోజుల్లోపు పరిష్కరించాలని సూచించారు. ఎలాంటి వివాదాలు లేకుండా, ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా పోడు భూముల్లో సాగు చేసుకుంటున్న అర్హులైన వారి క్లెయిమ్ లను శనివారం లోపు జిల్లా కమిటీకి అందించాలని స్పష్టమైన గడువు విధించారు.
అర్హులైన వారి నుండి నిర్దేశిత ఆధారాలను పంచాయతీ కార్యదర్శుల ద్వారా సేకరించాలని ఎంపీడీఓలు ఆదేశించారు. ఈ ప్రక్రియకు అత్యంత ప్రాధాన్యతనిస్తూ సాధ్యమైనంత త్వరగా పూర్తి చేయాలన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్ చిత్రామిశ్రా, జిల్లా అటవీ శాఖ అధికారి వికాస్ మీనా, జిల్లా గిరిజన అభివృద్ధి అధికారి నాగూరావు, నిజామాబాద్, బోధన్ ఆర్డీఓలు రవి, రాజేశ్వర్, ఆయా మండలాల తహసీల్దార్లు, ఎంపిడిఓలు పాల్గొన్నారు.