బాల్కొండ, ఫిబ్రవరి 15
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బాల్కొండ నియోజకవర్గం మెండోరా మండలం సోన్ పేట్ గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొని తిరిగి వెళ్తుండగా మార్గ మధ్యలో ఒక వృద్ధురాలు మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి కాన్వాయ్‌ను చూసి చేయి ఊపింది. అది గమనించిన మంత్రి తనతో ఏదో చెప్పుకోవాలని ఆ అవ్వ ప్రయత్నిస్తోందని తన కాన్వాయ్ ఆపి మరి ఆ అవ్వ దగ్గరికి వెళ్లి ఆమె సమస్యను అడిగి తెలుసుకున్నారు.
పెన్షన్ విషయం మంత్రి దృష్టికి తీసుకురాగా అక్కడే ఉన్న అధికారులకు వెంటనే సమస్య పరిష్కారం చేసి తనకు మళ్ళీ రిపోర్ట్ చేయాలని ఆదేశించారు. అనంతరం మంత్రి అవ్వను కుశల ప్రశ్నలతో ఆప్యాయంగా పలకరించారు. తాను ఉన్నానని పెన్షన్ వస్తుందని మంత్రి భరోసానిచ్చారు. తన సమస్యను తక్షణమే పరిష్కరించాలని అధికారులను ఆదేశించడంతో పాటు మంత్రి వేముల ఆప్యాయ పలకరింపుతో ఆ వృద్ధురాలు మోములో ఆనందం వెళ్లివిరిసింది.
నీవు సల్లగుండాలే బిడ్డ అని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డిని నిండు మనసుతో ఆశీర్వదించింది. వృద్దులు,దివ్యాంగుల సమస్యల పట్ల ఇట్టే చలించి పోయే మంత్రి వేముల మరోసారి తన మానవత్వాన్ని చాటుకున్నారు.