కామారెడ్డి, ఫిబ్రవరి 16
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : యాసంగి 2023 ధాన్యం కొనుగోలు కోసం జిల్లా అధికారులు ప్రణాళిక సిద్ధం చేయాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. కామారెడ్డి కలెక్టర్ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్లో గురువారం యాసంగి ధాన్యం కొనుగోలు పై వ్యవసాయ, మార్కెటింగ్, ఐకెపి, సివిల్ సప్లై అధికారులతో సమీక్ష నిర్వహించారు.
వ్యవసాయ శాఖ అధికారులు వచ్చే ధాన్యం దిగుబడిని అంచనా వేయాలని తెలిపారు. సరిపడ గన్ని సంచులను సిద్ధం చేయాలని చెప్పారు. కొనుగోలుకు సంబంధించి యంత్రాలు, ఇతర సామాగ్రిని సమకూర్చాలని అధికారులకు సూచించారు. మార్కెటింగ్, వ్యవసాయ, సహకార శాఖల అధికారులు, ఐకెపి అధికారులు సమన్వయంతో పనిచేసి ధాన్యం కొనుగోలు సజావుగా సాగే విధంగా చూడాలని పేర్కొన్నారు.
రైతులకు సరిపడా ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. సమావేశంలో రెవెన్యూ కలెక్టర్ చంద్రమోహన్, డిఎస్‌ఓ పద్మ, జిల్లా వ్యవసాయ అధికారిని భాగ్యలక్ష్మి, జిల్లా మార్కెటింగ్ అధికారిని రమ్య, ఐకెపి, సహకార, వ్యవసాయ శాఖల అధికారులు పాల్గొన్నారు.