కామారెడ్డి ఫిబ్రవరి 16
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రభుత్వం నిర్వహిస్తున్న కంటి వెలుగు, పోడు పట్టాల పంపిణీ, జీవో నెంబర్ 58, 59, 118 తో పాటు, తెలంగాణకు హరితహారం లాంటి కార్యక్రమాలు పకడ్బందీగా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి అన్నారు. హైదరాబాద్ నుండి కలెక్టర్లు అధికారులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్, జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ వెంకటేష్ దోత్రే, జిల్లా రెవెన్యూ అదనపు కలెక్టర్ చంద్రమోహన్‌తో కలిసి హాజరయ్యారు.
ఈ సందర్భంగా సిఎస్ మాట్లాడుతూ జిల్లాలో కంటి వెలుగు కార్యక్రమం పకడ్బందీగా నిర్వహించాలని, అవసరమైన మందులు, రీడిరగ్ కళ్లద్దాలు తెప్పించుకోవాలన్నారు. కార్యక్రమంలో ప్రజాప్రతినిధులను భాగస్వామ్యం చేయాలని సూచించారు. పోడు పట్టాల పంపిణీకి సంబంధించి తుది దశకు వచ్చిందని ప్రభుత్వ ఆదేశాల మేరకు పట్టాలు పంపిణీ చేయాల్సి ఉంటుందన్నారు. జీవో నెంబర్ 58, 59 కింద వచ్చిన దరఖాస్తులను పరిశీలన పూర్తి చేసి పట్టాలు పంపిణీ చేయాల్సి ఉంటుందన్నారు.
అనంతరం మిగతా వాటికి కూడా పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. జిల్లాల్లో ప్రభుత్వ భూములు కబ్జా కాకుండా చూడాలని, ఎక్కడ ప్రభుత్వ భూమి ఉన్న తప్పనిసరిగా దానికి కంచె వేయాలన్నారు. రెండు పడక గదుల ఇండ్ల లో మిగిలిపోయిన పనిని త్వరగా పూర్తి చేయాలన్నారు. హరితహారం కార్యక్రమానికి అవసరమైన ఏర్పాట్లు చేయాలన్నారు. జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ మాట్లాడారు.
జిల్లాలో కంటి వెలుగు కార్యక్రమం కొనసాగుతుందని తెలిపారు. దీనిలో ఎప్పటికప్పుడు స్థానిక ప్రజాప్రతినిధులను భాగస్వామ్యం చేస్తున్నట్లు వివరించారు. ప్రభుత్వ భూముల పరిరక్షణకు చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. పోడు పట్టాలకు సంబంధించిన సమాచారం గతంలోనే అందించడం జరిగిందని ప్రభుత్వ ఆదేశాల అనంతరం పంపిణీ చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు వివరించారు. కార్యక్రమంలో జిల్లా అటవీ శాఖ అధికారిని నిఖిత, డిఆర్‌డిఓ సాయన్న, డిపిఓ శ్రీనివాసరావు, ఆసుపత్రి సూపర్డెంట్ విజయలక్ష్మి, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.