కామారెడ్డి, ఫిబ్రవరి 16
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : చెస్ క్రీడాకారులు చాంపియన్షిప్ సాధించడానికి పట్టుదలతో కృషి చేయాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. కామారెడ్డి ఇందిరా గాంధీ స్టేడియంలో గురువారం జిల్లా యువజన క్రీడల శాఖ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా మహిళలకు జిల్లా స్థాయి చెస్ పోటీలు నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ ప్రారంభించి మాట్లాడారు.
క్రీడల వల్ల మానసిక ఉల్లాసం కలుగుతుందని తెలిపారు. క్రీడలలో ఓటమి చెందిన వారు అసంతృప్తికి లోను కావద్దని సూచించారు. నేటి ఓటమి రేపటి గెలుపునకు నాంది పలుకుతుందని చెప్పారు. క్రీడల వల్ల స్నేహభావం పెరుగుతుందని పేర్కొన్నారు. రాష్ట్రస్థాయి చెస్ పోటీలకు ఎంపికైన ఇద్దరు మహిళా క్రీడాకారులను అభినందించారు. కార్యక్రమంలో జిల్లా యువజన క్రీడల అధికారి దామోదర్ రెడ్డి, వ్యాయామ ఉపాధ్యాయులు, మహిళా క్రీడాకారులు పాల్గొన్నారు.