కామారెడ్డి, ఫిబ్రవరి 17
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : గ్రామ స్థాయిలో ఆరోగ్య పోషణ రోజును ప్రతినెల మొదటి వారంలో జరిగే విధంగా ఐసిడిఎస్ అధికారులు చూడాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. కామారెడ్డి కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో శుక్రవారం పోషణ అభియాన్ సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు.
మార్చి నెలలో 15 రోజులపాటు పోషణ పక్షోత్సవాలు నిర్వహించాలని తెలిపారు. గ్రామస్థాయిలో గర్భిణీలకు తప్పనిసరిగా నాలుగు సార్లు ఏఎన్ సీ పరీక్షలు చేయించే విధంగా ఆశా కార్యకర్తలు చూడాలన్నారు. గర్భిణిలకు పౌష్టికాహారం అందించాలని చెప్పారు. అంగన్వాడి కేంద్రాల్లో బలహీనమైన చిన్నారులను గుర్తించి వారికి వైద్య పరీక్షలు చేయించాలన్నారు. వారికి అదనంగా పౌష్టికాహారం అందే విధంగా చూడాలన్నారు.
ప్రతినెల అంగన్వాడి కార్యకర్తలు చిన్నారుల బరువు, ఎత్తు కొలచి వివరాలు మొబైల్ ఫోన్ లో నమోదు చేయాలని పేర్కొన్నారు. ప్రజా ప్రతినిధులు, అధికారులు అంగన్వాడి కేంద్రాల పనితీరును పర్యవేక్షణ చేయాలని సూచించారు. చిన్నారులకు వ్యాధి నిరోధక టీకాలు 100 శాతం ఇచ్చే విధంగా చూడాలన్నారు. గర్భిణీలు 102 సేవలు వినియోగించుకునే విధంగా అంగన్వాడి, ఆశ, ఆరోగ్య కార్యకర్తలు అవగాహన కల్పించాలని పేర్కొన్నారు. అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని కోరారు.
సమావేశంలో శిక్షణ కలెక్టర్ శివేంద్ర ప్రతాప్, రాజంపేట, నాగిరెడ్డిపేట, లింగంపేట, దోమకొండ జడ్పిటిసి సభ్యులు హనుమాన్లు, మనోహర్ రెడ్డి, శ్రీలత, తిరుమల్ గౌడ్, జిల్లా మహిళా, శిశు, దివ్యాంగుల, వయో వృద్ధుల సంక్షేమ అధికారిణి రమ్య, జెడ్పి సీఈవో సాయ గౌడ్, డిపిఓ శ్రీనివాసరావు, డీఎస్‌ఓ పద్మ, సిడిపివోలు, అధికారులు పాల్గొన్నారు.