నిజామాబాద్, ఫిబ్రవరి 17
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఆర్మూర్ రెవెన్యూ డివిజన్ పరిధిలోని ఆయా మండలాల్లో రైతులు సాగు చేసిన ఎర్రజొన్న పంటను బైబ్యాక్ ఒప్పందానికి అనుగుణంగా సీడ్ వ్యాపారులు కొనుగోలు చేసేలా క్షేత్ర స్థాయిలో పకడ్బందీ పర్యవేక్షణ జరపాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు సంబంధిత అధికారులను ఆదేశించారు. గురువారం సాయంత్రం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని తన ఛాంబర్లో అదనపు కలెక్టర్ చంద్రశేఖర్‌తో కలిసి వ్యవసాయ శాఖ అధికారులతో ఎర్రజొన్న పంట కొనుగోళ్ల ప్రస్తుత స్థితిగతులపై కలెక్టర్ సమీక్ష జరిపారు.
ఆయా మండలాల వారీగా ఎంత విస్తీర్ణంలో ఎర్రజొన్న సాగు చేశారు, ఏ మేరకు దిగుబడులు వస్తున్నాయి, రైతులతో సీడ్ కంపెనీలు బైబ్యాక్ ఒప్పందం కింద కుదుర్చుకున్న ధర ఎంత, ప్రస్తుతం మార్కెట్‌లో ఎర్రజొన్నకు ఎంత ధర పలుకుతోంది తదితర వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ రైతులు నష్టపోవడానికి వీలులేదని, సీడ్ వ్యాపారులు సిండికేట్‌గా మారి బైబ్యాక్ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ స్పష్టం చేశారు.
మార్కెట్ డిమాండ్ కు అనుగుణంగా ధర చెల్లిస్తూ ఎర్రజొన్న కొనుగోలు చేయాలని సూచించారు. ప్రస్తుతం ఎర్రజొన్న పంట దిగుబడులు చేతికందుతున్న దృష్ట్యా అధికారులు క్షేత్రస్థాయిలో ఉంటూ, ఎర్రజొన్న కొనుగోళ్లపై గట్టి పర్యవేక్షణ జరపాలని ఆదేశించారు. ఎర్రజొన్న సాగు చేసిన గ్రామాలలో రైతులతో సమావేశమై, పంట విక్రయంలో పాటించాల్సిన జాగ్రత్తల గురించి వ్యవసాయ అధికారులు అవగాహన కల్పించాలన్నారు.
అదే సమయంలో రైతులతో ఒప్పందం కుదుర్చుకున్న సీడ్ వ్యాపారులను సైతం సంప్రదించి ఎక్కడ కూడా బైబ్యాక్ ఒప్పందం ఉల్లంఘించకుండా, మార్కెట్ రేట్ కు అనుగుణంగా కొనుగోళ్లు జరిపేలా చూడాలన్నారు. సమావేశంలో జిల్లా వ్యవసాయ అధికారి తిరుమల ప్రసాద్, వాజిద్ హుస్సేన్, ఏ.డీ.ఏలు, ఆయా మండలాల వ్యవసాయ అధికారులు పాల్గొన్నారు.