నిజామాబాద్, ఫిబ్రవరి 20
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : 2023-2024 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి నిజామాబాద్ నగరపాలక సంస్థ ప్రతిపాదించిన బడ్జెట్ ఆమోదం పొందింది. సోమవారం స్థానిక న్యూ అంబెడ్కర్ భవన్ లో నగర మేయర్ దండు నీతూకిరణ్ అధ్యక్షతన నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో నిజామాబాద్ అర్బన్ శాసనసభ్యులు బిగాల గణేష్ గుప్తా, కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, అదనపు కలెక్టర్ చిత్రామిశ్రా పాల్గొన్నారు.
2023 -2024 సంవత్సరానికి సంబంధించిన ప్రతిపాదిత బడ్జెట్ తో పాటు, 2022 – 2023 సవరించిన అంచనా బడ్జెట్ ను సమావేశంలో ప్రవేశపెట్టగా, కౌన్సిల్ సభ్యులు ఆమోదించారు. 2022 ఏప్రిల్ 01 నాటికి ప్రారంభ నిల్వ రూ. 8257 . 68 లక్షలు, 2022 – 2023 సవరణ అంచనా సాధారణ ఆదాయం రూ. 8777 . 10 లక్షలు కలుపుకుని మొత్తం రూ. 17034 . 78 లక్షలుగా పేర్కొన్నారు. 2023 – 2024 లో అంచనా సాధారణ ఆదాయం రూ.17303 . 77 లక్షలుగా బడ్జెట్ లో పొందుపర్చారు. వ్యయం రూ. 9007 . 44 లక్షలుగా అంచనా వేస్తూ, 20224 మార్చి నెలాఖరు నాటికి రూ. 8296 . 33 లక్షలు మిగులు బడ్జెట్ గా ఉంటుందని అంచనా వేశారు. అదేవిధంగా 2023 – 2024 లో అంచనా క్యాపిటల్ ఆదాయం రూ. 17127 . 65 లక్షలు, వ్యయం రూ. 17059 .50 లక్షలుగా, డిపాజిట్లు రూ. 1120 .00 లక్షలుగా, అప్పులు రూ. 1100 . 00 లక్షలుగా బడ్జెట్ లో పేర్కొన్నారు.
ఈ మేరకు సమావేశంలో బడ్జెట్ ఆమోదం పొందిందని మేయర్ నీతూకిరణ్ ప్రకటించారు. ఈ సందర్భంగా తమతమ డివిజన్లలో నెలకొన్న సమస్యలను కార్పొరేటర్లు ప్రస్తావించగా, వాటి పరిష్కారానికి కృషి చేస్తామని ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా, మేయర్ నీతూకిరణ్ సానుకూలంగా స్పందించారు. సమావేశంలో ఆయా డివిజన్ల కార్పొరేటర్లు, నగర పాలక సంస్థకు చెందిన వివిధ విభాగాల అధికారులు పాల్గొన్నారు.