ఎడపల్లి, ఫిబ్రవరి 20
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రభుత్వ స్కూల్లలో విద్యార్థులకు అందిస్తున్న కోడిగుడ్డుకు పెరుగుతున్న ధరలకు అనుగుణంగా ప్రభుత్వం తమకు డబ్బులు చెల్లించడం లేదని మార్కెట్‌లో 7 రూపాయలకు కొనుగోలు చేసి విద్యార్థులకు అందిస్తే ప్రభుత్వం తమకు కేవలం రూ.5 అందించడం వల్ల ఒక్కో గుడ్డుకు రూ. 2 వరకు నష్టపోతున్నామని ఇకనుండి మధ్యాహ్న భోజనంలో కోడిగుడ్డును పెట్టలేమని దీనికి సహకరించాలని కోరుతూ సోమవారం తెలంగాణా మధ్యాహ్న భోజన కార్మికుల యూనియన్ ఆధ్వర్యంలో మండల తహసీల్దార్ శేఖర్‌కు వినతిపత్రం అందజేశారు.
ఈ సందర్బంగా మధ్యాహ్న భోజన కార్మికుల యూనియన్ జిల్లా అధ్యక్షురాలు చామంతుల లక్ష్మీ మాట్లాడుతూ.. జిల్లాలోని మధ్యాహ్న భోజన కార్మికులకు గత నవంబర్ నెలనుండి ఇప్పటివరకు సుమారు రూ.14 కోట్ల బిల్లులు బకాయి ఉందని ఇంతవరకు ప్రభుత్వం చెల్లించలేదని అన్నారు. దీనికి తోడు విపరీతంగా పెరిగిపోతున్న గుడ్ల ధరలతో తాము పెద్ద ఎత్తున నష్టపోతున్నామని అన్నారు.
మార్కెట్ లో గుడ్డు ధర రూ. 7 ఉంటే ప్రభుత్వం తమకు కేవలం రూ. 5 చెల్లిస్తుందని ఒక విద్యార్ధికి ఇచ్చే గుడ్డు వల్ల సుమారు. 2 రూపాయలు నష్టం వస్తుందని అన్నారు. ఈ విషయమై ఎంఈఓ, డీఈఓ పలుమార్లు పిర్యాదు చేసినా చర్యలు శూన్యం అన్నారు. ఓ వైపు బిల్లులు రాక మరోవైపు నష్టాన్ని భరించలేక ఆర్థికంగా, మానసికంగా నష్టపోతున్నామని అన్నారు.
ఇకనుండి మధ్యాహ్న భోజనంలో విద్యార్థుల కు గుడ్డును అందించలేమని అన్నారు. దీనికి సహకరించాలని కోరారు. కార్యక్రమంలో మధ్యాహ్న భోజన కార్మికుల యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి చక్రపాణి, మండల అధ్యక్షురాలు బి లక్ష్మీ, సావిత్రి, రాజమణి, పోశెట్టి, విజయ, సుజాత, సావిత్రి, సాయమ్మ తదితరులు ఉన్నారు.