ఎడపల్లి, ఫిబ్రవరి 20
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తమ గ్రామానికి వెళ్లే రహదారిలో గల కల్లుబట్టి వల్ల గ్రామానికి చెందిన మహిళలు, పాఠశాల, కళాశాల విద్యార్థులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని దానిని అక్కడి నుంచి తొలగించాలని కోరుతూ ఎడపల్లి మండలంలోని ధర్మారం గ్రామస్తులు సోమవారం బోధన్ ఏసీపీ కిరణ్ కుమార్‌కు, బోధన్ ఎక్సైజ్ సీఐ రూప్ సింగ్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్బంగా గ్రామస్తులు మాట్లాడారు.
ఎమ్మెస్సి ఫారం, ధర్మారం గ్రామాల మధ్య ప్రధాన రహదారికి ప్రక్కనే కల్లుబట్టిని ఏర్పాటు చేయడం వల్ల తాగుబోతులు కల్లుమత్తులో మహిళలను, స్కూల్, కాలేజీ విద్యార్థినిలను వేదిస్తున్నారని అన్నారు. కల్లు మత్తులో ఎలాంటి అఘాయిత్యాలకి పాల్పడుతారో భయభ్రాంతులకు గురవుతున్నామన్నారు.
తమ గ్రామానికి వెళ్లే రోడ్డులో ఉన్న కల్లుబట్టిని వెంటనే అక్కడినుంచి తొలగించాలని గ్రామ పంచాయతీలో తీర్మానము చేసి బోధన్ ఏసీపీకి ఎక్సైజ్ సీఐకి పిర్యాదు చేశామని అన్నారు. సంబంధిత అధికారులు వెంటనే స్పందించి కల్లుబట్టిని అక్కడి నుండి వేరే చోటికి తరలించాలని కోరారు. పిర్యాదు చేసిన వారిలో రవి, గంగాదాస్, కే గంగాధర్, నర్సయ్య, నరేష్, అశోక్, సాయిలు, చిన్న గంగారాం తదితరులు ఉన్నారు.