నిర్దేశిత లక్ష్యాలకు అనుగుణంగా రుణాల పంపిణీ జరగాలి

నిజామాబాద్‌, ఫిబ్రవరి 21

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆయా రంగాలకు రుణాల పంపిణీలో నిర్దేశిత లక్ష్యాలను పూర్తి స్థాయిలో సాధించేందుకు బ్యాంకర్లు కృషి చేయాలని కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతు సూచించారు. ప్రత్యేకించి నిజామాబాద్‌ జిల్లా వ్యవసాయాధారిత ప్రాంతమైనందున పంట రుణాల పంపిణీకి అధిక ప్రాధాన్యత ఇవ్వాలని హితవు పలికారు. మంగళవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని కాన్ఫరెన్స్‌ హాల్‌లో కలెక్టర్‌ అధ్యక్షతన జిల్లా స్థాయి బ్యాంకర్ల సంప్రదింపుల కమిటీ సమావేశం జరిగింది.

గత ఖరీఫ్‌, రబీ సీజన్లకు సంబంధించి కేటాయించిన లక్ష్యాలు, సాధించిన ప్రగతి గురించి బ్యాంకుల వారీగా కలెక్టర్‌ సమీక్షించారు. ఆయా రంగాల్లో పలు బ్యాంకులు లక్ష్యానికి అనుగుణంగా రుణాలు అందించగా, మరికొన్ని బ్యాంకులు వెనుకంజలో ఉండిపోవడానికి గల కారణాలను కలెక్టర్‌ ఆరా తీశారు. గత ఏడాది సగటున 88 శాతం పంట రుణాల లక్ష్యాన్ని సాధించగా, ఈ ఏడాది ఇప్పటి వరకు అనేక బ్యాంకులు 30 శాతం వరకే పంట రుణాలు పంపిణీ చేశాయని అన్నారు.

రుణ వితరణను వేగవంతం చేసి నిర్దిష్ట గడువు లోపు లక్ష్య సాధనకు చొరవ చూపాలన్నారు. పంటల సాగుకు అవసరమైన పెట్టుబడిని రుణాల రూపేణా బ్యాంకర్లు అందించకపోతే రైతులు ప్రైవేట్‌ వడ్డీ వ్యాపారులను ఆశ్రయించి ఆర్థికంగా నష్టపోయే ప్రమాదం ఉంటుందని, అలాంటి పరిస్థితి ఉత్పన్నం కాకుండా వ్యవసాయరంగానికి విరివిగా రుణాలు అందించేందుకు బ్యాంకర్లు చొరవ చూపాలన్నారు. పంట రుణాల విషయంలో రైతులు ఏమైనా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారా అనే విషయాలను క్షేత్ర స్థాయిలో పరిశీలింపజేయాలని జిల్లా వ్యవసాయ అధికారిని ఆదేశించారు.

రుణాలను రెన్యూవల్‌ చేసుకోవడం వల్ల వడ్డీ భారం నుండి మినహాయింపు పొందడంతో పాటు కొత్తగా పంట రుణాలు పొందే వెసులుబాటు ఉంటుందనే విషయాన్ని వివరిస్తూ రైతులకు విస్తృత స్థాయిలో అవగాహన కల్పించాలన్నారు. వ్యవసాయ శాఖతో సమన్వయము చేసుకుని క్రమం తప్పకుండా రైతు వేదికల్లో అన్నదాతలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని బ్యాంకర్లకు సూచించారు.

జిల్లాలో సేద్యపు రంగం ప్రధాన ఆధారంగా ఉన్నందున, ప్రతి రైతుకు సేవలను విస్తరింపజేసేందుకు చిత్తశుద్ధితో కృషి చేయాలని బ్యాంకర్లకు సూచించారు. తదుపరి సమావేశం నాటికి పరిస్థితిలో స్పష్టమైన మార్పు కనిపించాలన్నారు. స్వయం సహాయక సంఘాలకు పూర్తి స్థాయిలో లింకేజీ రుణాలు పంపిణీ చేయాలని, సబ్సిడీ రుణాల పంపిణీలో జాప్యం చేయవద్దని సూచించారు. లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాలని ఎస్సీ, ఎస్టీ సంక్షేమ శాఖల అధికారులను ఆదేశించారు. వీధి వ్యాపారులకు విరివిగా ముద్ర రుణాలతో పాటు స్టాండ్‌ అప్‌ ఇండియా కింద రుణాలు అందించాలన్నారు.

స్టేట్‌ బ్యాంకు ఆఫ్‌ ఇండియా ఆధ్వర్యంలో గ్రామీణ ప్రాంత యువతకు స్వయం ఉపాధి కోర్సుల్లో అందిస్తున్న శిక్షణను విజయవంతంగా పూర్తి చేసుకున్న అర్హులైన అభ్యర్థులకు యూనిట్ల స్థాపన కోసం రుణాలు అందించేందుకు బ్యాంకర్లు చొరవ చూపాలన్నారు. కాగా, ఈ ఏడాది వ్యవసాయ రంగానికి 5905.60 కోట్ల రూపాయల రుణాలు అందించాలని లక్ష్యం కాగా, రూ. 4172 .74 కోట్లను పంపిణీ చేసి 70 శాతం లక్ష్యాన్ని సాధించడం జరిగిందని లీడ్‌ బ్యాంక్‌ జిల్లా మేనేజర్‌ శ్రీనివాస్‌ రావు కలెక్టర్‌ దృష్టికి తెచ్చారు. సమావేశంలో ఆర్‌.బి.ఐ డీజీఎం రాజేంద్ర ప్రసాద్‌, నాబార్డు డీడీఎం నాగేష్‌, వివిధ శాఖల జిల్లా స్థాయి అధికారులు, బ్యాంకర్లు పాల్గొన్నారు.

Check Also

బోధన్‌లో రోడ్డు భద్రతపై బాలికలకు అవగాహన

Print 🖨 PDF 📄 eBook 📱 బోధన్‌, నవంబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రోడ్డు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »