బాన్సువాడ, ఫిబ్రవరి 21
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఫిబ్రవరి 23 నుండి 26 వరకు హైదరాబాద్ నగరంలో జరుగు ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ 19వ జాతీయ మహాసభలను జయప్రదం చేయాలని, ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్, రాష్ట్ర నాయకులు, ఉమ్మడి నిజామాబాద్ జిల్లా ప్రధాన కార్యదర్శి గొల్లపల్లి రాజుగౌడ్ పిలుపునిచ్చారు. మంగళవారం బాన్సువాడ పట్టణ కార్యాలయంలో జాతీయ మహాసభల పోస్టర్లు ఆవిష్కరించారు.
అనంతరం రాజుగౌడ్ మాట్లాడుతూ జాతీయ మహాసభలకు దేశవ్యాప్తంగా 28 రాష్ట్రాల నుంచి దాదాపు 500 మంది ప్రతినిధులు హాజరవుతారని, 25 దేశాల నుండి సౌహర్ద ప్రతినిధులు హాజరు కానున్నారని పేర్కొన్నారు. జాతీయ మహాసభలు తెలుగు రాష్ట్రాలలో మొదటిసారిగా హైదరాబాదులో జరుగుతున్నాయని, జాతీయ మహాసభలను తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా, అదేవిధంగా పక్కన ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి అధిక సంఖ్యలో ప్రజలు కార్యకర్తలు, అభిమానులు హాజరై విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు.
రాబోయే రోజుల్లో భారతదేశంలో నూతన రాజకీయ వ్యవస్థను నెలకొల్పడానికి హైదరాబాదులో జరగనున్న జాతీయ మహాసభలు వేదిక కానున్నాయని అన్నారు. నేతాజీ మార్గంలో భారతదేశ పునర్ నిర్మాణం కోసం మత, ప్రాంతీయ భేదాలు లేకుండా సమ సమాజ స్థాపన ధ్యేయంగా ఆలిండియా ఫార్వర్డ్ బ్లాక్ దిన దిన అభివృద్ధి జరుగుతుందని చెప్పారు.
జాతీయ మహాసభల స్ఫూర్తితో తెలంగాణ రాష్ట్రంలో బలమైన శక్తిగా ఫార్వర్డ్ బ్లాక్ అవుతుందని, రానున్న శాసనసభ ఎన్నికల్లో కామారెడ్డి, నిజామాబాద్ జిల్లాలోని అన్ని నియోజకవర్గాలలో ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పోటీ చేస్తుందని రాజుగౌడ్ తెలిపారు. అదేవిధంగా రాష్ట్రంలోని 100 పైగా నియోజకవర్గాలలో పోటీలో ఉంటుందని, ఉద్యమకారులకు, బడుగు, బలహీన వర్గాలకు ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీలో సముచిత స్థానం ఉంటుందని, వారికి ఎన్నికల్లో అవకాశాన్ని పార్టీ కల్పిస్తుందని ఆయన తెలిపారు. కార్యక్రమంలో కామారెడ్డి జిల్లా కన్వీనర్ బైరాపూర్ రవీందర్ గౌడ్, గంగాధర్, రమేష్, సాయిలు, భాస్కర్, జ్ఞానేశ్వర్, రాజు, సాయికిరణ్ తదితరులు పాల్గొన్నారు.