కామారెడ్డి, ఫిబ్రవరి 22
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద చేపట్టిన అభివృద్ధి పనులను త్వరగా పూర్తిచేసే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖ కార్యదర్శి అశోక్ కుమార్ అన్నారు. బుధవారం హైదరాబాదు నుండి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అన్ని జిల్లాల కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖ కార్యదర్శి మాట్లాడారు.
జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద జిల్లాలలో చేపట్టిన అభివృద్ధి పనులను వేగవంతం చేసి త్వరగా పూర్తిచేసే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని తెలిపారు. ఉపాధి హామీ పథకం కింద అర్హులైన శ్రామిక కుటుంబాలకు పని కల్పిస్తూ ఉపాధి కల్పిస్తున్నామని తెలిపారు. అర్హులైన వారిని గుర్తించి జాబ్ కార్డులు ఇస్తున్నామని చెప్పారు. జిల్లాలలో చేపట్టిన ఉపాధి హామీ పనులలో పనిచేస్తున్న కూలీలకు సకాలంలో చెల్లింపులు చేస్తున్నామన్నారు. ఉపాధి హామీ పథకం కింద మంజూరైన పనులకు అనుమతులు పొందిన అనంతరం కూలీలకు పనులు కల్పించేందుకు చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు.

జిల్లాలో ఎంపిక చేయబడిన పనులకు పాలనపరమైన అనుమతులు మంజూరు చేసి త్వరితగతిన పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలని తెలిపారు. కొనసాగుతున్న పనుల పురోగతిపై ఫోటోలను అప్లోడ్ చేయాలని, అర్హులైన కూలీలకు మాత్రమే పనులు కల్పించేందుకు చర్యలు తీసుకోవాలని చెప్పారు. ఉపాధి హామీ పథకం కింద విస్తృతంగా మొక్కల పెంపకం దిశగా దృష్టి సారించాలని తెలిపారు.
జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ మాట్లాడారు. జిల్లాలో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద చేపట్టిన అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయని తెలిపారు. మన ఊరు మన బడి కార్యక్రమం కింద పాఠశాలలలో అభివృద్ధి పనులు జరుగుతున్నాయని చెప్పారు. పనులు వేగవంతం చేసే దిశగా సంబంధిత శాఖల అధికారుల సమన్వయంతో పనిచేస్తున్నామని పేర్కొన్నారు. కార్యక్రమంలో శిక్షణ కలెక్టర్ శివేంద్ర ప్రతాప్, జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి సాయన్న, అదనపు డిఆర్‌డిఓ మురళీకృష్ణ, అధికారులు పాల్గొన్నారు.