నిజామాబాద్, ఫిబ్రవరి 22
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం అమలులో అక్రమాలపై కఠిన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా కలెక్టర్లకు సూచించారు. బుధవారం ఆయన రాష్ట్ర గ్రామీణాభివృద్ధి సంస్థ సంచాలకులు హనుమంత రావుతో కలిసి ఉపాధి హామీ సామాజిక తనిఖీ అంశంపై జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు.
సోషల్ ఆడిట్ లో నిధులు దుర్వినియోగం జరిగినట్లు వెల్లడైన ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలించాలన్నారు. నిధుల వినియోగంలో అవకతవకలకు పాల్పడిన వారిని ఎంతమాత్రం ఉపేక్షించకూడదని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. పలు జిల్లాలలో పనులు చేయకుండానే తప్పుడు రికార్డులు సృష్టించి నిధుల కైంకర్యానికి పాల్పడడం, మొక్కల సంరక్షణ చర్యల పేరుతో నిధులను స్వాహా చేయడం వంటి ఉదంతాలను ఈ సందర్భంగా ఉటంకించారు.
నిధుల దుర్వినియోగానికి పాల్పడినట్లు నిర్ధారణ అయిన పక్షంలో నిధుల రికవరీ, నోటీసుల జారీ వంటి వాటితోనే సరిపెట్టుకోకుండా, అక్రమాల తీవ్రతను బట్టి బాధ్యులైన వారిని అవసరమైతే విధుల నుండి తొలగించాలని సూచించారు. హెచ్చరికలు, నామమాత్రపు పెనాల్టీలతో అక్రమాలకు అడ్డుకట్ట పడదని, నిధులను పక్కదారి పట్టిస్తే కఠిన చర్యలు ఉంటాయనే సంకేతాలు స్పష్టంగా వెళ్లాలన్నారు. అప్పుడే అవకతవకలను అరికట్టేందుకు వీలవుతుందని పేర్కొన్నారు.
పని చేయకుండానే తప్పుడు రికార్డులు సృష్టించి నిధులను వాడుకోవడం నేరపూరిత చర్యగా పరిగణించాలన్నారు. వెచ్చించిన నిధుల విలువకు సరిపడా పనులు జరిగాయా, లేదా అన్నది ఫోటోగ్రాఫ్స్, ఇతర స్పష్టమైన ఆధారాలతో పరిశీలించాలని సూచించారు. ఈ విషయమై జిల్లా కలెక్టర్ స్పందిస్తూ, సామాజిక తనిఖీ నివేదికల ఆధారంగా బాధ్యులపై తగిన చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. వీడియో కాన్ఫరెన్స్‌లో అదనపు కలెక్టర్ చిత్రామిశ్రా, డీఆర్‌డీఓ చందర్, ఏ.పీ.డీ సంజీవ్ తదితరులు పాల్గొన్నారు.