కామారెడ్డి, ఫిబ్రవరి 23
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఆరోగ్య లక్ష్మి పథకం ద్వారా గర్భిణీలకు పౌష్టికాహారం అందుతుందని రాష్ట్ర ఫుడ్ కమిషన్ చైర్మన్ తిరుమల్ రెడ్డి అన్నారు. సదాశివ నగర్ మండల కేంద్రంలో గురువారం అంగన్వాడి కేంద్రాలను, ఆరోగ్య ఉప కేంద్రాన్ని, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను సందర్శించారు. అంగన్వాడి కేంద్రంలో చిన్నారుల వయసును బట్టి ఎత్తుకు తగిన విధంగా బరువు ఉండే విధంగా చూడాలన్నారు.
వయసుకు తగిన ఎత్తు, బరువు లేకపోతే వారికి అదనంగా పౌష్టికాహారాన్ని అందించాలని అంగన్వాడీ కార్యకర్తలకు సూచించారు. కెసిఆర్ న్యూట్రిషన్ కిట్టు ద్వారా గర్భిణీలకు అందించే మందులు, డ్రై ఫ్రూట్స్ వివరాలను వైద్యులను అడిగి తెలుసుకున్నారు.
జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజనం అందుతున్న తీరును విద్యార్థులను అడిగి తెలుసుకుని సంతృప్తిని వ్యక్తం చేశారు. కార్యక్రమంలో డిఆర్‌డిఓ సాయన్న, ప్రజా ప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.