నిజామాబాద్, ఫిబ్రవరి 23
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి రాష్ట్రస్థాయిలో గుర్తింపు పొందడం కేవలం పారిశుద్ధ కార్మికులే ప్రదామని ఆసుపత్రి సూపరిండెంట్ డాక్టర్ ప్రతిమ రాజ్ అన్నారు. గురువారం ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి 7వ అంతస్తులో తెలంగాణ మెడికల్ కాంటాక్ట్ ఎంప్లాయిస్ అండ్ వర్కర్స్ యూనియన్ (ఏఐటీయూసీ అనుబంధం) కార్మికుల సమావేశం పి.సుధాకర్ అధ్యక్షతన జరిగింది.
సమావేశానికి ముఖ్య అతిథులు హాజరైన ఆసుపత్రి సూపరింటెండెంట్ ప్రతిమరాజ్ మాట్లాడుతూ ఆస్పత్రి శుభ్రంగా ఉండడానికి, ఆసుపత్రికి వచ్చే రోగులు ఆరోగ్యంగా ఉంటున్నారంటే పారిశుద్ధ కార్మికులు మాత్రమేనని అన్నారు. నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి రాష్ట్ర స్థాయి గుర్తింపు రావడానికి డాక్టర్లు, నర్సులు, వీటితోపాటు కార్మికుల పాత్రనే ప్రధానమైనదని ఆమె పేర్కొన్నారు.
ఈ సందర్భంగా ఏఐటీయూసీ జాతీయ కౌన్సిల్ సభ్యులుగా ఎన్నికైన వై.ఓమయ్యను సూపరిండెంట్, కార్మిక నాయకులు శాలువాలతో సన్మానించడం జరిగింది. అనంతరం ఓమయ్య మాట్లాడుతూ ఆసుపత్రిలో పనిచేస్తున్న కార్మికులకు తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన జీవో 21 ప్రకారం 12 వేల 93 రూపాయలు నెలకు వేతనం అమలు చేయాలని డిమాండ్ చేసారు.
నిజామాబాద్ జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రిలో ఇన్ పేషెంట్స్, అవుట్ పేషంట్స్ సంఖ్య పెరుగుతున్నందున ఆసుపత్రిలో బెడ్ల సంఖ్యను 750కి పెంచి ఉన్నటువంటి కార్మికులకు పని భారం తగ్గించి కార్మికుల సంఖ్యను పెంచాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి హైమది, నాయకులు భాగ్యలక్ష్మి, స్వరూప, నరసయ్య, వెంకట్, యాదగిరి, సాయి, పేషంట్ కేర్లు, కార్మికులు పాల్గొన్నారు.