బాల్కొండ, ఫిబ్రవరి 24
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బాల్కొండ నియోజకవర్గం ఏర్గట్ల మండలంలో శుక్రవారం పలు అభివృద్ది పనుల శంకుస్థాపన, ప్రారంభోత్సవం కార్యక్రమాల్లో రాష్ట్ర రోడ్లు భవనాలు శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి పాల్గొన్నారు. మహిళలు మంగళ హారతులతో, గ్రామస్థులు డప్పు చప్పుళ్లతో మంత్రికి ఘన స్వాగతం పలికారు. చిన్నా పెద్దా అందర్నీ పలకరిస్తూ మంత్రి ముందుకు సాగారు. పురాతన దేవాలయం శ్రీ లక్ష్మి నరసింహ స్వామీ వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు.
ఏర్గట్ల మండల కేంద్రంలో 38 లక్షల వ్యయంతో నిర్మించిన నూతన గ్రామ పంచాయతి భవనం, సుమారు 16 లక్షల వ్యయంతో నిర్మించిన ప్రాథమిక వ్యవసాయ సహకార కేంద్రం అదనపుగది ప్రారంభోత్సవం, పురాతన లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయంలో 18 లక్షల వ్యయంతో నూతనంగా నిర్మించిన కళ్యాణ మండపం ప్రారంభోత్సవం కార్యక్రమాల్లో పాల్గొన్నారు.
అనంతరం తాళ్ల రాంపూర్ గ్రామంలో 16 లక్షల వ్యయంతో నూతనంగా నిర్మించిన హెల్త్ సబ్ సెంటర్ ప్రారంభోత్సవం, 20 లక్షల వ్యయంతో నిర్మించే నూతన గ్రామ పంచాయతీ బిల్డింగ్ శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్బంగా మీడియాతో మాట్లాడారు… ముఖ్యమంత్రి కేసిఆర్ ఆశీర్వాదంతో బాల్కొండ నియోజకవర్గంలో అభివృద్ది పనుల పరంపర కొనసాగుతోందని తెలిపారు.
ఏర్గట్ల, తాళ్ళరాంపూర్ గ్రామంలో పలు అభివృద్ది పనుల ప్రారంభోత్సవం, శంకుస్ధాపన చేసుకున్నామని తెలిపారు. ఎల్లప్పుడూ బాల్కొండ నియోజకవర్గ అభివృద్ధికి కంకణబద్దుడనై ఉంటానని మంత్రి స్పష్టం చేశారు. పసుపు బోర్డు పేరుతో రైతులను మోసం చేసి,గ్రామాల అభివృద్ధికి రూపాయి కూడా తేని వారు ఎవరు..? నిత్యం ప్రజల్లో ఉంటూ గ్రామాల అభివృద్ది కోసం,రైతుల కోసం పనిచేస్తున్న వారు ఎవరో ప్రజలే ఆలోచన చేయాలని కోరారు. ఇవాళ వందల కోట్లతో బాల్కొండ నియోజకవర్గంలోని అన్ని గ్రామాలు అభివృద్ది చేసుకుంటున్నామని మంత్రి తెలిపారు.