నిజామాబాద్, ఫిబ్రవరి 24
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : అంధత్వ నివారణే లక్ష్యంగా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న కంటి వెలుగు శిబిరాలను విరివిగా సందర్శిస్తూ, క్షేత్రస్థాయిలో ఈ కార్యక్రమం అమలు తీరును నిశితంగా పర్యవేక్షించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి సూచించారు.శుక్రవారం సాయంత్రం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా కలెక్టర్లతో వివిధ అంశాలపై సి.ఎస్ సమీక్ష నిర్వహించారు.
డబుల్ బెడ్ రూమ్ పథకంతో పాటు కంటి వెలుగు, పోడు భూములకు పట్టాల పంపిణీ, జీ.ఓ నెం.లు 58, 59, 76, 118 అమలు, తెలంగాణకు హరితహారం, ఆయిల్ పామ్ సాగు, సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో ఒకే గొడుగు కింద అన్ని ప్రభుత్వ శాఖలను చేర్చడం తదితర అంశాల ప్రగతిని సమీక్షిస్తూ మార్గనిర్దేశం చేశారు. కంటి వెలుగు కార్యక్రమం మరింత వేగం పుంజుకుందని, ప్రతి రోజు రాష్ట్ర వ్యాప్తంగా సగటున రెండు లక్షల మందికి నేత్ర పరీక్షలు నిర్వహిస్తూ, అవసరమైన వారికి కంటి అద్దాలు అందించడం జరుగుతోందని అన్నారు. కంటి వెలుగు ద్వారా ప్రజలకు మరింత నాణ్యమైన సేవలు అందేలా కృషి చేయాలని, వారానికి కనీసం ఒక శిబిరాన్నైనా తప్పనిసరి సందర్శించాలని సూచించారు.
కాగా, రెండు పడక గదుల ఇళ్ల నిర్మాణాలకు సంబంధించి లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియను వేగవంతం చేయాలని, వివరాలను ఆన్ లైన్ పోర్టల్ లో అప్లోడ్ చేయాలన్నారు. ఈ ప్రక్రియలకు ప్రాధాన్యతనిస్తూ సత్వరమే పూర్తి చేయాలని అన్నారు. కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు స్పందిస్తూ, జిల్లాలో ఇప్పటికే 400 మంది లబ్ధిదారుల ఎంపిక పూర్తయ్యిందని, మరో రెండుమూడు రోజుల్లో మిగతా లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియను పూర్తి చేస్తామని, వివరాలను వెంటదివెంట ఆన్లైన్ పోర్టల్ లో అప్లోడ్ చేయిస్తున్నామని తెలిపారు.
కాగా, పోడు భూములకు సంబంధించి వచ్చిన క్లెయిమ్ లను జిల్లా కమిటీ స్థాయిలో పరిశీలన జరుపుతూ, త్వరితగతిన పరిష్కరించాలని సీ.ఎస్ సూచించారు. ప్రభుత్వ ఆదేశాలు వెలువడిన మీదట అర్హులైన వారికి పాస్ బుక్కులు అందించేలా అన్ని ఏర్పాట్లను పూర్తి చేసుకోవాలని అన్నారు. పట్టా పాస్ బుక్కుల ముద్రణలో ఎలాంటి తప్పులు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
తెలంగాణకు హరితహారం కార్యక్రమానికి ప్రాధాన్యతనిస్తూ, మొక్కల సంరక్షణ, క్రమం తప్పకుండా నీటిని అందించడంపై దృష్టి సారించాలన్నారు. పాడైపోయిన మొక్కల స్థానంలో కొత్త మొక్కలను ఏర్పాటు చేయించాలన్నారు. అలాగే, ఆయిల్ పామ్ సాగు లక్ష్య సాధనకు చొరవ చూపాలని, స్థానికంగా ఆయిల్ పామ్ మొక్కలు అందుబాటులో లేనిపక్షంలో నిర్మల్ తదితర ప్రాంతాల్లోని నర్సరీల నుండి తెప్పించుకోవాలని సూచించారు.
కాగా, ఇప్పటికే 17 చోట్ల సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయాలు అందుబాటులోకి వచ్చిన దృష్ట్యా, అన్ని ప్రభుత్వ శాఖల జిల్లా కార్యాలయాలు ఐ.డీ.ఓ.సీ ల్లోనే కొనసాగేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. వీడియో కాన్ఫరెన్స్‌లో అదనపు కలెక్టర్ చిత్రామిశ్రా, జిల్లా అటవీ శాఖ అధికారి వికాస్ మీనా, కలెక్టరేట్ ఏ.ఓ ప్రశాంత్, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.