కామారెడ్డి, ఫిబ్రవరి 24
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : వసతి గృహాలు, రెసిడెన్షియల్ స్కూల్లు వారంలో రెండు రోజులు మండల స్థాయి అధికారులు పర్యవేక్షణ చేయాలని రాష్ట్ర ఫుడ్ కమిషన్ చైర్మన్ తిరుమల్ రెడ్డి అన్నారు. కామారెడ్డి కలెక్టరేట్లో శుక్రవారం జాతీయ ఆహార భద్రత యాక్ట్ 2013 పై సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా జరై రాష్ట్ర ఫుడ్ కమిషన్ చైర్మన్ తిరుమల్ రెడ్డి మాట్లాడారు.
విద్యార్థులకు పౌష్టికాహారం అందే విధంగా చూడాలని సూచించారు. కెసిఆర్ న్యూట్రిషన్ కిట్టుపై గ్రామస్థాయిలో ఐసిడిఎస్, వైద్య శాఖ అధికారులు అవగాహన సదస్సులు ఏర్పాటు చేయాలని తెలిపారు. గర్భిణీలో రక్తహీనత తగ్గించడానికి కేసీఆర్ న్యూట్రిషన్ కిట్ దోహదపడుతుందని చెప్పారు. పాఠశాలల్లో మధ్యాహ్న భోజనానికి నాణ్యమైన బియ్యాన్ని తీసుకెళ్లవలసిన బాధ్యత మండల స్థాయి విద్యాశాఖ అధికారులదేనని పేర్కొన్నారు.
బీర్కూరు మండలం భైరవపూర్ లో 110 మంది విద్యార్థులకు 25 రోజులపాటు మధ్యాహ్న భోజనం పెట్టనందున వారికి తగిన పరిహారం ఇవ్వాలని విద్యాశాఖ అధికారి రాజుకు సూచించారు. అంగన్వాడి కేంద్రాల్లో ఆరోగ్య లక్ష్మి పథకం సక్రమంగా అమలయ్యే విధంగా చూడాలన్నారు. వైద్యం, విద్య, ఎస్సీ ,ఎస్టీ, బీసీ వసతి గృహాలు, పౌరసరఫరాలు, ఐసిడిఎస్ శాఖలపై సమీక్ష నిర్వహించారు. సమావేశంలో జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్, జిల్లా రెవెన్యూ అదనపు కలెక్టర్ చంద్రమోహన్, డిఆర్‌డిఓ సాయన్న, సివిల్ సప్లై డిఎం అభిషేక్, అసిస్టెంట్ సివిల్ సప్లై అధికారి పి. వెంకటేశ్వరరావు, జిల్లా విద్యాశాఖ అధికారి రాజు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.