నిజామాబాద్, ఫిబ్రవరి 25
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కాకతీయ వైద్య కళాశాలలో పీజీ విద్యార్ధి ప్రీతి ఆత్మహత్య యత్నం కలవర పెడుతున్న విషయం మరవక ముందే నిజామాబాద్ ప్రభుత్వ వైద్య కళాశాలలో మరో మెడికో ఆత్మహత్య చేసుకోవడం కలకలం లేపింది. ఎంబీబీఎస్ ఫైనల్ ఇయర్ చదువుతున్న విద్యార్థి హాస్టల్ గదిలోనే ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడడం తల్లిదండ్రులకు తీరని బాధను మిగిల్చింది.
నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ మెడికల్ కళాశాలలో విద్యార్థి ఆత్మహత్య కలకలం చోటుచేసుకుంది. ఉరివేసుకొని మెడికో ఫైనల్ ఇయర్ విద్యార్థి బలవన్మరణానికి పాల్పడ్డారు. నగరంలోని మెడికల్ కళాశాలలో దాసరి హర్ష (22) అనే విద్యార్థి ఎంబిబిఎస్ ఫైనల్ ఇయర్ చదువుతున్నాడు. కళాశాలలోని బాయ్స్ హాస్టల్‌లోని తన 105 గదిలో ఫ్యాన్‌కు ఉరి వేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డాడు. మృతికి గల వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఘటన స్థలానికి చేరుకున్న ఒకటవ టౌన్ ఎస్సై విజయ్ బాబు, సిబ్బంది కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
అయితే శనివారం ఫైనల్ ఇయర్ సంబంధించి పరీక్షలు ఉన్నాయి. 2018లో వైద్య విద్యార్థిగా చేరి శనివారం తనువు చాలించాడు. ఉదయం హాస్టల్ గదిలోని 105 రూములో తలుపుకు గడియ పెట్టుకొని బెడ్ షీట్‌తో ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మెడికల్ కాలేజీ అధికారులు వెంటనే విద్యార్థి కుటుంబీకులకు సమాచారం అందించారు. నిజామాబాద్ జిల్లా మెడికల్ కళాశాలలో వైద్య విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డ ఘటన ఇది రెండవది.
అయితే సీనియర్ డాక్టర్ల ఒత్తిడా లేక ఇంకేమైనా కారణాలు ఉన్నాయా అనే కోణంలో పోలీసుల విచారణ చేపడుతున్నారు. వరంగల్‌లోని కాకతీయ మెడికల్ కళాశాలలో సీనియర్ విద్యార్థుల వేధింపులు తాళలేక ప్రీతి అనే వైద్య విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడ్డ ఘటన మరువకముందే, నిజామాబాద్ జిల్లాలో ఇలా జరగడం కలకలం రేపింది. మృతుడు హర్ష మంచిర్యాల జిల్లాకు చెందిన వాడు. ఉదయం ఘటన జరిగినప్పటికీ మంచిర్యాల నుండి తల్లిదండ్రులు వచ్చేంతవరకు పంచనామా నిర్వహించలేదు. మధ్యాహ్నం కుటుంబీకులు రావడంతో పంచనామా నిర్వహించి పోస్టుమార్టం కోసం తరలించారు. హర్ష తల్లిదండ్రుల రోదనలు అక్కడి వారందరిని కంటతడి పెట్టించాయి.